
Minimum Balance Charges: మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై ఊరటనిచ్చిన బ్యాంకులు: ఈ ఐదు బ్యాంకుల్లో కనీస నిల్వ అవసరం లేదు
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా పొదుపు ఖాతాల్లో నిర్దేశిత మినిమమ్ సగటు నిల్వ (Minimum Average Balance) లేదన్న కారణంగా బ్యాంకులు ఖాతాదారులపై అపరాధ రుసుములు (Penalty Charges) వసూలు చేస్తుంటాయి. అయితే ఇటీవల కొని బ్యాంకులు ఈ నియమాన్ని సడలించి, ఖాతాదారులకు గట్టి ఊరటనిచ్చాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) లాంటి ప్రముఖ బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. మరి, ప్రస్తుతం ఈ ఛార్జీల నుంచి విముక్తి కల్పించిన బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం:
వివరాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB):
పీఎన్‌బీ తమ అన్ని సేవింగ్స్ ఖాతాలపై కనీస సగటు నిల్వ (MAB) నిర్వహించాల్సిన అవసరం లేకుండా చేసినట్లు ప్రకటించింది. దీనివల్ల ఎంఏబీ నిల్వ లేకపోయినా ఇకపై ఖాతాదారులపై ఎటువంటి పెనాల్టీలు విధించరు. ఈ నిర్ణయం 2025 జులై 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. మహిళలు, వ్యవసాయదారులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అశోక్ చంద్ర తెలిపారు.
వివరాలు
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda):
ఈ ప్రభుత్వరంగ బ్యాంకు కూడా ఖాతాదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన అపరాధ రుసుములను పూర్తిగా తొలగించింది. ''ఎలాంటి టెన్షన్ లేకుండా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాం. ఇకపై కనీస నిల్వ లేకపోయినప్పటికీ ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది అన్ని సేవింగ్స్ ఖాతాలకు వర్తించనుంది'' అని జులై 2న 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా బ్యాంక్ ప్రకటించింది.
వివరాలు
ఇండియన్ బ్యాంక్ (Indian Bank):
ఇటీవల మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించిన బ్యాంకుల్లో ఇండియన్ బ్యాంక్ కూడా చేరింది. ఈ బ్యాంకు జులై 7, 2025 నుంచి తమ అన్ని పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ నిబంధనలకు మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇది ఖాతాదారులకు మరింత లాభదాయకం కానుంది.
వివరాలు
కెనరా బ్యాంక్ (Canara Bank):
2025 మే నెలలోనే కెనరా బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై కీలక ప్రకటన చేసింది. అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలు, శాలరీ ఖాతాలు, ఎన్నారై ఎస్‌బీ ఖాతాలు సహా మరికొన్ని ఖాతాలపై కనీస నిల్వలపై విధించే అపరాధ రుసుములను రద్దు చేసింది. ఈ నిర్ణయం కూడా జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఎన్నారైలు, సీనియర్ సిటిజన్లు సహా అనేక మంది ఖాతాదారులకు ఈ మార్పు వల్ల లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే అవకాశం లభించనుందని బ్యాంకు స్పష్టం చేసింది.
వివరాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI):
భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ (SBI) ఇప్పటికే చాలా కాలం కిందటే మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది. 2020 నుంచే ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాదారులపై కనీస నిల్వ లేకపోతే విధించే అపరాధ రుసుములను ఎత్తివేసింది. అందువల్ల ప్రస్తుతం ఎస్బీఐలో ఉన్న ఖాతాదారులు ఎలాంటి కనీస నిల్వ అవసరం లేకుండానే ఖాతాను నిర్వహించవచ్చు. ఇలా, దేశంలోని ప్రధాన బ్యాంకులలో ఐదు బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి ఖాతాదారులను విముక్తి చేస్తూ వినూత్న నిర్ణయాలు తీసుకున్నాయి. ఇది ఆర్థికంగా వెనుకబడిన, సాధారణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే మార్గంగా నిలవనుంది.