SIP: మార్కెట్ ఆటుపోట్లలో సిప్‌ను ఎలా నడపాలి?
ఈ వార్తాకథనం ఏంటి
ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు పెట్టుబడి ప్రయాణంలో సహజమే. ముఖ్యంగా షేర్ల ధరలు రోజురోజుకూ మారుతుంటే, చాలామంది మదుపరులు ఆందోళనకు గురవుతారు. ఆ భయంతో తమ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)లను నిలిపివేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంటుంది. కానీ సరైన వ్యూహాన్ని అనుసరిస్తే, ఈ అస్థిరతనే మంచి అవకాశంగా మలచుకోవచ్చు. సగటు సూత్రంపై నమ్మకం క్రమానుగత పెట్టుబడి విధానంలో ప్రధానంగా పనిచేసేది రూపాయి సగటు సూత్రం. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా,నిర్ణీత వ్యవధుల్లో ఒకే మొత్తాన్ని పెట్టుబడి చేయడమే సిప్ బలం. మార్కెట్ పడినప్పుడు తక్కువ ధరలకు ఎక్కువ యూనిట్లు, ధరలు పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు మీ ఖాతాలో చేరతాయి. దీని వల్ల కాలక్రమేణా యూనిట్‌కు వచ్చే సగటు ధర తగ్గుతుంది.
వివరాలు
స్టెప్-అప్ సిప్‌తో లాభం
స్వల్పకాలిక హెచ్చుతగ్గుల ప్రభావం తగ్గిపోతుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడాన్ని ఈ విధానం నియంత్రిస్తుంది. ఆదాయం పెరిగినప్పుడు లేదా ఆర్థిక లక్ష్యాల మార్పుల ఆధారంగా, ఏటా లేదా ఆరు నెలలకొకసారి సిప్ మొత్తాన్ని పెంచుకునే అవకాశం ఉంది. దీన్నే స్టెప్-అప్ సిప్‌గా పిలుస్తారు. మార్కెట్ పడిపోయిన సందర్భాల్లో సిప్ మొత్తాన్ని పెంచితే, తక్కువ ఎన్‌ఏవీ వద్ద ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ పెట్టుబడి + రూపాయి సగటు ప్రయోజనం కలిసి, దీర్ఘకాలంలో నిధుల విలువ వేగంగా పెరగడానికి దోహదపడతాయి. జీతం పెరిగినప్పుడు ఖర్చులు పెంచడం కంటే, సిప్‌ను పెంచడంపై దృష్టి పెట్టడం మేలు.
వివరాలు
లక్ష్యం ఆధారంగా పెట్టుబడి
సాధారణ సిప్‌కు భిన్నంగా, పోర్ట్‌ఫోలియో పనితీరును ఆధారంగా చేసుకుని పెట్టుబడి మొత్తాన్ని మార్చే విధానమూ ఉంది. మీ పోర్ట్‌ఫోలియో లక్ష్యానికి తక్కువగా ఉంటే, అదనపు మొత్తాన్ని మదుపు చేయాలి. రాబడులు తగ్గినప్పుడు పెట్టుబడిని పెంచడం వల్ల, తక్కువ ధరల వద్ద కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ విధానం నిరంతర పర్యవేక్షణ అవసరమయ్యే కాబట్టి, మార్కెట్‌ను తరచూ గమనించే వారికి మాత్రమే ఇది అనుకూలం.
వివరాలు
మార్కెట్ పడినప్పుడు అవకాశం
మార్కెట్లు క్షీణించిన సమయంలో ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి చేసే వ్యూహాన్ని కూడా అనుసరించవచ్చు. ధరలు తగ్గినప్పుడు ఎక్కువ యూనిట్లు దక్కుతాయి. తక్కువ ఎన్‌ఏవీ ఉన్న సమయంలో నెలవారీ సిప్‌కు తోడుగా ఒకేసారి పెట్టుబడి చేయడం ద్వారా అదనపు లాభాన్ని అందుకోవచ్చు. అయితే మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించేవారికే ఈ విధానం సరిపోతుంది.
వివరాలు
బదిలీ వ్యూహం ద్వారా రిస్క్ నియంత్రణ
సిస్టమేటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్ (ఎస్‌టీపీ) ద్వారా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి క్రమంగా పెట్టుబడిని మార్చుకోవచ్చు. ఉదాహరణకు, మొదట డెట్ ఫండ్లలో ఏకమొత్తం పెట్టుబడి చేసి, అక్కడి నుంచి క్రమంగా ఈక్విటీ ఫండ్లకు బదిలీ చేయవచ్చు. ఇది అస్థిర మార్కెట్లలో ఈక్విటీ రిస్కును తగ్గించడంలో సహాయపడుతుంది. పొదుపు ఖాతాలో తక్కువ వడ్డీకి డబ్బు ఉంచడం కన్నా, ఈ విధానం మెరుగైన రాబడితో పాటు రూపాయి సగటు ప్రయోజనాన్ని అందిస్తుంది.
వివరాలు
సమీక్ష తప్పనిసరి
మార్కెట్ కదలికల కారణంగా, మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ-డెట్ నిష్పత్తి మారవచ్చు. మార్కెట్ భారీగా పెరిగినప్పుడు ఈక్విటీ వాటా మీరు నిర్ణయించిన పరిమితిని మించిపోవచ్చు. అందుకే నిర్ణీత వ్యవధుల్లో పెట్టుబడులను సమీక్షించి, ఆస్తుల కేటాయింపును తిరిగి సరిచేసుకోవాలి. మార్కెట్ ఎగసినప్పుడు ఈక్విటీల లాభాలను డెట్ వైపు మళ్లించడం, మార్కెట్ పడినప్పుడు ఈక్విటీ వాటాను పెంచడం ఇందులో భాగం. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచి, నష్టభయాన్ని తగ్గిస్తుంది.
వివరాలు
వైవిధ్యమే రక్షణ
లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, హైబ్రిడ్ వంటి విభిన్న ఫండ్లలో సిప్‌ను విస్తరించాలి. ఇలా చేయడం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం తగ్గుతుంది. ఒక్కో విభాగం ఒక్కో సమయంలో వేర్వేరుగా స్పందిస్తుంది. మిడ్ క్యాప్‌లలో అస్థిరత ఎక్కువగా ఉండగా, లార్జ్ క్యాప్ ఫండ్లు సాధారణంగా స్థిరంగా ఉంటాయి. వైవిధ్యం వల్ల ఏ ఒక్క విభాగంపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
వివరాలు
ఆపాలా? కొనసాగించాలా?
మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో సిప్‌ను తాత్కాలికంగా ఆపేయాలనే ఆలోచన రావడం సహజమే. కానీ స్వల్పకాలిక కదలికలకు భయపడి పెట్టుబడులను నిలిపేస్తే, దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బతింటాయి. చరిత్రను పరిశీలిస్తే, మార్కెట్ పతనాల సమయంలోనూ సిప్‌ను కొనసాగించిన మదుపరులే, మార్కెట్ తిరిగి కోలుకున్నప్పుడు ఎక్కువ లాభాలు పొందారు. స్థిరంగా పెట్టుబడి చేయడం వల్ల ఆస్తుల కేటాయింపు సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి సిప్ కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తాత్కాలిక మార్కెట్ పరిస్థితులపై కాకుండా, మీ ఆర్థిక లక్ష్యాలు మరియు నష్టాన్ని భరించే సామర్థ్యంపై ఆధారపడి ఉండాలి.