CIBIL Score: మీ క్రెడిట్ స్కోరు 800+ దాటాలంటే ఇవి తప్పనిసరి..
ఈ వార్తాకథనం ఏంటి
మంచి క్రెడిట్ స్కోరు ఉంటే రుణాలు తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తాయి. రుణ దరఖాస్తులు వేగంగా ఆమోదం పొందుతాయి. అంతేకాదు, వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలతో చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోరు 800కు పైగా ఉంటే, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో భారీగా ఆదా చేసుకోవచ్చు. అయితే, 800కు మించిన సిబిల్ స్కోరు కలిగినవారు చాలా కొద్దిమందే. అసలు ఇందుకు కారణాలేమిటి? ఆ స్థాయి స్కోరును ఎలా సాధించాలి అన్నదే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న.
వివరాలు
సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు రెండూ ఒకటేనని భావన
చాలామంది సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు రెండూ ఒకటేనని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి క్రెడిట్ స్కోర్లను జారీ చేసే సంస్థలు అనేకం ఉన్నాయి. ఆర్ బి ఐ అనుమతితో ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్, సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు పనిచేస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కూడా వాటిలో ఒకటే. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎక్కువగా సిబిల్ స్కోరునే ప్రామాణికంగా పరిగణిస్తాయి. దీంతో క్రెడిట్ స్కోరు అనే మాటకు సిబిల్‌నే సమానార్థకంగా వాడుతున్నారు.
వివరాలు
ఏదైనా ఒక్క లోపం ఉంటే 800 మార్క్ దాటడం కష్టమే
సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది.ఇందులో 800కు మించిన స్కోరు ఉన్నవారిని 'ఎక్సలెంట్' కేటగిరీలోకి తీసుకుంటారు. కానీ ఈ స్థాయికి చేరుకున్నవారు మొత్తం వినియోగదారుల్లో కేవలం 10 నుంచి 20 శాతం మధ్యలోనే ఉంటారన్నది అంచనా. ఎక్కువమంది 700-750 లేదా 750-800 పరిధిలోనే ఉన్నారు.పేమెంట్ హిస్టరీ,క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో,క్రెడిట్ హిస్టరీ వ్యవధి వంటి అంశాలు స్కోరుపై కీలక ప్రభావం చూపుతాయి. వీటిలో ఏదైనా ఒక్క లోపం ఉన్నా 800 మార్క్ దాటడం కష్టమే. పైగా దేశంలో ఇప్పటికీ క్రెడిట్ స్కోరు లేనివారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీర్ఘకాలిక క్రెడిట్ హిస్టరీ లేకపోవడం,వ్యక్తిగత కారణాలతో చెల్లింపులు ఆలస్యం కావడం వంటి అంశాలు చాలామందిని 800+ స్కోరు నుంచి దూరం చేస్తున్నాయి.
వివరాలు
పేమెంట్ హిస్టరీ
సాధారణంగా ఆర్థిక అవగాహన ఉన్నవారు, క్రమశిక్షణతో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించేవారే మెరుగైన క్రెడిట్ స్కోరును సాధిస్తున్నారు. అయితే 800 స్కోరు సాధ్యం కాదా? సాధ్యమే, కానీ క్రమశిక్షణ తప్పనిసరి. ముందుగా చెల్లింపులు సమయానికి చేయడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు, ఇతర రుణాల చెల్లింపులు ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా చూసుకోవాలి. క్రెడిట్ స్కోరు లెక్కలో పేమెంట్ హిస్టరీ ప్రభావం దాదాపు 30 నుంచి 35 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం తగదు.
వివరాలు
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో
తర్వాత ముఖ్యమైనది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో.అంటే మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితిలో ఎంత భాగాన్ని వినియోగిస్తున్నారన్నది. ఈ రేషియో ఎక్కువగా ఉంటే స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది.కాబట్టి ఇది ఎప్పుడూ 30శాతం లోపే ఉండేలా చూసుకోవాలి. రేషియో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.క్రెడిట్ స్కోరుపై దీని ప్రభావం సుమారు 25 నుంచి 30శాతం వరకు ఉంటుంది. క్రెడిట్ హిస్టరీ కూడా చాలా కీలకం.మీ రుణ చరిత్ర ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగితే స్కోరు మెరుగ్గా ఉంటుంది. పాత బ్యాంకు ఖాతాలు,క్రెడిట్ కార్డులను అలాగే కొనసాగించడం మంచిది. అవసరం లేకుండా పాత కార్డులను మూసివేయడం స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. మొత్తం స్కోరులో క్రెడిట్ హిస్టరీ వాటా దాదాపు 15శాతం ఉంటుంది.
వివరాలు
రెండు రకాల రుణాల సరైన మిశ్రమం ఉంటే క్రెడిట్ స్కోరు మెరుగుపడే అవకాశం
ఇక క్రెడిట్ మిక్స్ విషయానికి వస్తే, హామీ ఉన్న రుణాలు,హామీ లేని రుణాలు రెండూ ఉండడం మంచిదే. గృహ, వాహన, బంగారం రుణాలు హామీతో కూడినవిగా పరిగణిస్తారు. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, స్టూడెంట్ లోన్లు హామీ లేని రుణాల కేటగిరీలోకి వస్తాయి. ఈ రెండు రకాల రుణాల సరైన మిశ్రమం ఉంటే క్రెడిట్ స్కోరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. స్కోరు లెక్కలో క్రెడిట్ మిక్స్ ప్రభావం 10 నుంచి 15 శాతం వరకు ఉంటుంది. రుణాల కోసం తరచూ దరఖాస్తులు చేయడం కూడా ప్రమాదకరమే. ప్రతి సారి రుణానికి అప్లై చేసినప్పుడు సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ మీ క్రెడిట్ నివేదికను పరిశీలిస్తుంది.
వివరాలు
క్రెడిట్ స్కోరును తీవ్రంగా దెబ్బతీసే అంశం ఏంటంటే..
తక్కువ సమయంలో అనేక ఎంక్వైరీలు ఉంటే, మీపై ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ఒకేసారి అనేక సంస్థల్లో దరఖాస్తు చేయకుండా, అన్ని అంశాలు పరిశీలించి ఒకే సంస్థను ఎంపిక చేసుకోవడం మంచిది. రుణ సెటిల్‌మెంట్ కూడా క్రెడిట్ స్కోరును తీవ్రంగా దెబ్బతీసే అంశమే. సెటిల్‌మెంట్‌లో భాగంగా బ్యాంకు రుణ మొత్తంలో కొంత భాగాన్ని మాఫీ చేస్తుంది. ఇది తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా, దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. 800కు పైగా స్కోరు లక్ష్యంగా పెట్టుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ సెటిల్‌మెంట్‌కు వెళ్లకూడదు.
వివరాలు
ఈ వివరాలు సరిగా నమోదుకాకపోతే, మీ స్కోరు తగ్గే ప్రమాదం
చివరిగా, క్రెడిట్ రిపోర్ట్ అనేది మీ ఆర్థిక చరిత్రకు అద్దంలాంటిది. ఇందులో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది మీకే నష్టం చేస్తుంది. రుణ మొత్తం, చెల్లింపుల తేదీలు, బకాయిల వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఒకవేళ లోన్ రీపేమెంట్ వివరాలు సరిగా నమోదుకాకపోతే, మీ స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. అందుకే క్రెడిట్ రిపోర్టును తరచూ తనిఖీ చేసి, తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవడం ఎంతో అవసరం.