Toshifumi Suzuki: 7-ఎలెవెన్ దిగ్గజం తోషిఫుమి సుజుకి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా 7-ఎలెవెన్ స్టోర్ల విజయానికి ప్రధాన శక్తిగా నిలిచిన సెవెన్ అండ్ ఐ హోల్డింగ్స్ మాజీ సీఈఓ తోషిఫుమి సుజుకి (93 )వయసులో కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆయన మరణించినట్లు సంస్థ వెల్లడించింది. జపాన్‌లో రిటైల్ రంగాన్ని పూర్తిగా మార్చిన వ్యాపారవేత్తగా సుజుకికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1974లో టోక్యోలోని టోయోసు ప్రాంతంలో మొదటి 24 గంటల 7-ఎలెవెన్ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా సుజుకి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ఇది జపాన్‌లో వినూత్న ఆలోచనగా నిలిచింది. తర్వాత ఈ మోడల్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
వివరాలు
అమెరికా సంస్థను కొనుగోలు చేసిన సాహసోపేత నిర్ణయం
1990లో అమెరికాకు చెందిన 7-ఎలెవెన్ మాతృసంస్థ సౌత్‌ల్యాండ్ కార్పొరేషన్ దివాళా తీసిన సమయంలో సుజుకి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థను కొనుగోలు చేసి 7-ఎలెవెన్‌ను మరింత విస్తరించారు. ఆయన నాయకత్వంలో కనీసం 16 దేశాల్లో 55 వేలకుపైగా స్టోర్లు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 85 వేలకుపైగా 7-ఎలెవెన్ స్టోర్లు ఉన్నాయి. వాటిలో దాదాపు నాలుగో వంతు జపాన్‌లోనే ఉన్నాయి. 2003లో ఇటో-యోకాడో కంపెనీకి చైర్మన్, సీఈఓగా సుజుకి బాధ్యతలు చేపట్టారు. 2005లో ఆ సంస్థ పేరును 'సెవెన్ అండ్ ఐ హోల్డింగ్స్'గా మార్చారు. ఆయన నాయకత్వంలో ఇండోనేషియా, డెన్మార్క్ వంటి దేశాలకు 7-ఎలెవెన్ విస్తరించింది. అమెరికాలో కూడా స్టోర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు.
వివరాలు
వివాదాల మధ్య తప్పుకున్న సుజుకి
2016లో అమెరికా యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ డేనియల్ లోబ్‌తో విభేదాల నేపథ్యంలో సుజుకి అకస్మాత్తుగా పదవి నుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ 7-ఎలెవెన్‌ను ప్రపంచ బ్రాండ్‌గా నిలబెట్టిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 1932 డిసెంబర్ 1న జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లో సకాకి పట్టణంలో సుజుకి జన్మించారు. ఆయన తండ్రి జిన్‌షిరో ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి హిసామి కుటుంబ వ్యవసాయం, పట్టు పురుగుల వ్యాపారాన్ని నిర్వహించేవారు.