LOADING...
Tump Tarif: అమెరికా కొత్త టారిఫ్‌ వార్‌: భారత ఫార్మా రంగంపై ప్రభావం ఎంత?

Tump Tarif: అమెరికా కొత్త టారిఫ్‌ వార్‌: భారత ఫార్మా రంగంపై ప్రభావం ఎంత?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. విదేశాల నుంచి దిగుమతయ్యే పేటెంట్‌ పొందిన ఔషధాలపై 100 శాతం వరకు సుంకం విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. దేశంలోకి వచ్చే మందులు,వాటి ముడి పదార్థాల దిగుమతులు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఫార్మా రంగంపై సుంకాలు విధించే అవకాశముందని వచ్చిన వార్తలతో గురువారం దేశీయ ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ఈ నిర్ణయం భారత ఫార్మా కంపెనీలపై ఎంత ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది.

వివరాలు 

ఉత్తర్వుల ముఖ్యాంశాలు

'మోస్ట్ ఫేవర్డ్' ఒప్పందం కింద అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఔషధ సంస్థలు అక్కడే తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తే, వాటి పేటెంట్‌, ఇతర ఉత్పత్తులపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండవు. కానీ అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం లేకుండా పేటెంట్ మందులు పంపే కంపెనీలకు 100% వరకు టారిఫ్‌ విధిస్తారు. అలాగే ధరల ఒప్పందం లేకుండా ఫ్యాక్టరీలు నిర్మిస్తున్న సంస్థలపై ప్రస్తుతం 20% పన్ను ఉండగా, ఇది నాలుగేళ్లలో దశలవారీగా 100%కి పెరుగుతుంది. అయితే ప్రస్తుతానికి జనరిక్‌, బయోసిమిలర్‌, అత్యవసర ఔషధాలకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు.

వివరాలు 

భారత ఫార్మాపై ప్రభావం

భారతీయ కంపెనీలు ప్రధానంగా జనరిక్ మందులను అమెరికాకు ఎగుమతి చేస్తాయి. ప్రస్తుతం ఈ మందులపై ఎలాంటి సుంకాలు లేనందున తక్షణ ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో జనరిక్ మందులపై కూడా పన్నులు విధించే అవకాశాన్ని వైట్‌హౌస్‌ సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే భారత ఫార్మా రంగానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే Dr. Reddy's Laboratories,Sun Pharmaceutical Industries,Biocon వంటి కంపెనీలు జనరిక్ మందులతో పాటు పేటెంట్ మందులను కూడా అమెరికాలో విక్రయిస్తున్నాయి. కాబట్టి వీటిపై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ టారిఫ్‌లపై చర్చలు జరిపేందుకు పెద్ద కంపెనీలకు 120రోజులు,చిన్న,మధ్య తరహా సంస్థలకు 180 రోజుల గడువు అమెరికా ప్రభుత్వం ఇచ్చింది.

Advertisement