Trump Tariff Refunds: అమెరికాలో భారీ రీఫండ్ ప్రక్రియ ప్రారంభం.. ఎవరికెంత లాభం?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో భారీగా వసూలైన టారిఫ్‌లపై ఇప్పుడు రీఫండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలో విధించిన ఈ దిగుమతి సుంకాలను US సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో, వాటిని చెల్లించిన కంపెనీలు సోమవారం నుంచి రీఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు. US Customs and Border Protection కొత్త ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఉదయం 8 గంటల నుంచి క్లెయిమ్‌లు స్వీకరిస్తుంది. కంపెనీలు తాము చెల్లించిన టాక్స్ వివరాలు స్పష్టంగా సమర్పించాలి. సాధారణంగా 60 నుంచి 90 రోజుల్లో డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, టెక్నికల్ సమస్యల వల్ల ఆలస్యం కావొచ్చు.
వివరాలు
టారిఫ్‌లుగా 166బిలియన్ డాలర్లు
ఈ రీఫండ్ ప్రక్రియకు కారణం ఫిబ్రవరి 20న వచ్చిన కోర్టు తీర్పు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన భారీ టారిఫ్‌లు కాంగ్రెస్ అధికారాలను దాటి ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో గతంలో వసూలైన సుంకాలను తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రీఫండ్లు అమెరికా చరిత్రలోనే అతిపెద్దవిగా ఉండనున్నాయి. అంచనాల ప్రకారం 3 లక్షలకుపైగా దిగుమతిదారులు దాదాపు 166బిలియన్ డాలర్లు టారిఫ్‌లుగా చెల్లించారు. ఈ ప్రక్రియను CAPE అనే ప్రత్యేక సిస్టమ్ ద్వారా నిర్వహిస్తారు.కంపెనీలు తమ అకౌంట్ వివరాలు ఇచ్చి క్లెయిమ్‌లు ఫైల్ చేయాలి. అయితే డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొదటి రోజుల్లో సిస్టమ్‌లో టెక్నికల్ ఇబ్బందులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
వివరాలు
రీఫండ్లు నేరుగా వచ్చే అవకాశాలు తక్కువ
ఇక చిన్న వ్యాపార సంస్థలు ఈ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే డబ్బులు రావడానికి నెలలు పడితే తమ క్యాష్ ఫ్లో సమస్యలు వెంటనే పరిష్కారం కావని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు ఈ రీఫండ్లు నేరుగా వచ్చే అవకాశాలు తక్కువే. ఎందుకంటే టారిఫ్‌లు దిగుమతిదారులే చెల్లిస్తారు. అయినప్పటికీ కొన్ని కంపెనీలపై వినియోగదారులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని కేసులు కొనసాగుతున్నాయి.