Loading...
TVS family feud: టీవీఎస్ కుటుంబంలో వారసత్వ ఆస్తుల వివాదం.. తండ్రిపై కోర్టుకెక్కిన కుమార్తె
టీవీఎస్ కుటుంబంలో వారసత్వ ఆస్తుల వివాదం.. తండ్రిపై కోర్టుకెక్కిన కుమార్తె

TVS family feud: టీవీఎస్ కుటుంబంలో వారసత్వ ఆస్తుల వివాదం.. తండ్రిపై కోర్టుకెక్కిన కుమార్తె

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల పంపకాల అంశం వివాదానికి దారితీసింది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తుల్లో చట్టబద్ధంగా తనకు రావాల్సిన వాటాను కేటాయించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కుటుంబ ఆస్తుల పంపకాల్లో కుమార్తెలకు ఉండే హక్కులు, పెద్ద వ్యాపార సంస్థల్లో వారసత్వ వ్యవహారాలు మరోసారి చర్చకు రావడానికి ఈ పరిణామం కారణమైంది. ఈ వివాదానికి 2024లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఆస్తుల పంపిణీ ఒప్పందం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

వివరాలు 

ఇద్దరు పిల్లలకు న్యాయం జరిగే విధంగానే ఆస్తుల పంపిణీ

అప్పట్లో కుదిరిన ఒప్పందంలో వ్యాపార సంస్థలకు సంబంధించిన బాధ్యతలు, నిర్వహణ వ్యవహారాలను మాత్రమే పంచారని లక్ష్మీ వేణు, ఆమె తల్లి మల్లికా శ్రీనివాసన్ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే, కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తుల్లో తమకు రావాల్సిన ఆర్థిక వాటా విషయాన్ని మాత్రం ఆ ఒప్పందంలో తేల్చలేదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు, కుటుంబంలోని ఇద్దరు పిల్లలకు న్యాయం జరిగే విధంగానే ఆస్తుల పంపిణీ ప్రక్రియ చేపట్టామని వేణు శ్రీనివాసన్ చెబుతున్నారు.

టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ వంటి సంస్థల్లోని వాటాలు నేరుగా కాకుండా 'వీఎస్ ట్రస్ట్'తో పాటు ఇతర హోల్డింగ్ సంస్థల ద్వారా నిర్వహణలో ఉన్నాయి.

వివరాలు 

హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతోంది?

దీంతో ఈ సంస్థల్లోని వాటాల యాజమాన్యం, కుటుంబ సభ్యుల ఆర్థిక హక్కుల అంశాలు కూడా ఈ వివాదంలో కీలకంగా మారాయి.

తనకు ఆస్తిలో సమాన వాటా రావాలనే వాదనకు లక్ష్మీ వేణు హిందూ వారసత్వ చట్టం-1956ను ప్రాతిపదికగా తీసుకున్నారు.

ఈ చట్టానికి 2005లో చేసిన సవరణ ప్రకారం, హిందూ మితాక్షర ఉమ్మడి కుటుంబంలో కుమార్తెలకు కూడా కుమారులతో సమానంగా పిత్రార్జిత ఆస్తిపై హక్కులు ఉంటాయి.

అంటే, కుటుంబంలో కొడుకులకు ఉన్నట్లుగానే కూతుళ్లు కూడా పుట్టుకతోనే సహదాయాదులుగా గుర్తింపు పొందుతారు.

ఉమ్మడి కుటుంబ ఆస్తుల విభజనను కోరే చట్టబద్ధమైన అధికారం కూడా వారికి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

హిందూ వారసత్వ చట్టం ఏం చెబుతోంది?

ఈ హక్కుల విషయంలో తండ్రి జీవించి ఉన్నారా? లేదా? అన్నది నిర్ణయాత్మక అంశం కాదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.

2005లో చట్ట సవరణ అమల్లోకి వచ్చిన సమయంలో తండ్రి జీవించి ఉండాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది.

దీంతో పిత్రార్జిత ఆస్తుల్లో కుమార్తెలకు కూడా కొడుకులతో సమానమైన హక్కులు లభించాయి.

ADVERTISEMENT

వివరాలు 

పిత్రార్జితం, స్వార్జితం మధ్య తేడా ఏమిటి?

అయితే, టీవీఎస్ కుటుంబానికి సంబంధించిన ఈ వ్యవహారంలో కొన్ని ముఖ్యమైన న్యాయపరమైన అంశాలను కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా పిత్రార్జిత ఆస్తి, స్వార్జిత ఆస్తి మధ్య తేడాను గుర్తించడం అవసరం.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిత్రార్జిత ఆస్తిని చట్ట నిబంధనలకు అనుగుణంగా విభజించాల్సి ఉంటుంది.

కానీ ఒక వ్యక్తి తన సొంత సంపాదనతో కొనుగోలు చేసిన స్వార్జిత ఆస్తిని మాత్రం తన ఇష్టానుసారం ఇతరులకు బదిలీ చేయవచ్చు లేదా వీలునామా ద్వారా ఎవరికైనా కేటాయించవచ్చు.

ఈ రెండు రకాల ఆస్తుల మధ్య ఉన్న వ్యత్యాసమే వారసత్వ వివాదాల్లో కీలకంగా మారుతుంది.

ఏ ఆస్తి పిత్రార్జితం? ఏది వ్యక్తిగత సంపాదనతో సమకూర్చుకున్నది? అనే అంశాలను బట్టి వారసులకు లభించే హక్కులు మారుతుంటాయి.

వివరాలు 

ఫ్యామిలీ ట్రస్టుల కింద ఆస్తులుంటే పరిస్థితి ఎలా ఉంటుంది?

టీవీఎస్ గ్రూప్‌కు సంబంధించిన అనేక ఆస్తులు, కంపెనీల్లోని వాటాలు కుటుంబ ట్రస్టులు, ఇతర హోల్డింగ్ సంస్థల పరిధిలో ఉన్నాయి.

ఇలాంటి సందర్భాల్లో ఆస్తులపై చట్టబద్ధమైన యాజమాన్యం ఎవరిది? ట్రస్టు నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి.

ఎందుకంటే ట్రస్టు పేరుతో ఉన్న ఆస్తికి చట్టపరమైన యజమాన్యం ట్రస్టుదే అవుతుంది.

అందువల్ల సాధారణ కుటుంబ ఆస్తుల విభజన కేసుల మాదిరిగా వాటాల పంపిణీని కోరడం అంత సులభం కాదు.

ఇక్కడ వ్యాపార సంస్థల నిర్వహణ బాధ్యతలు ఎవరికి అప్పగించారనే అంశం ఒకటైతే, వాటిలోని ఆస్తులపై అసలు యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయనే విషయం మరోటి.

ఈ రెండింటినీ ఒకే అంశంగా చూడకూడదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వివరాలు 

కుటుంబ ఒప్పందాన్ని కోర్టులో సవాలు చేయవచ్చా?

కాబట్టి కుటుంబ వ్యాపారాల నిర్వహణలో ఒకరికి బాధ్యతలు అప్పగించినంత మాత్రాన ఆస్తులపై ఇతర కుటుంబ సభ్యుల హక్కులు కూడా ముగిసిపోయినట్లు కాదనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాలపై ఒకసారి ఒప్పందం కుదిరితే సాధారణంగా అందులోని నిబంధనలు సంబంధిత వ్యక్తులందరికీ వర్తిస్తాయి.

అయితే, ఆ ఒప్పందం మోసం, బలవంతం లేదా ఇతర చట్టపరమైన లోపాలతో జరిగిందని భావిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దానిని సవాలు చేసే అవకాశం ఉంటుంది.

వివరాలు 

కుటుంబ ఒప్పందాన్ని కోర్టులో సవాలు చేయవచ్చా?

ప్రస్తుతం లక్ష్మీ వేణు దాఖలు చేసిన కేసులో 2024లో కుటుంబ సభ్యుల మధ్య కుదిరిన ఒప్పందం చట్టబద్ధంగా చెల్లుతుందా?ఆ ఒప్పందం ద్వారా ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా పరిష్కారమయ్యాయా?కుటుంబ ఉమ్మడి ఆస్తుల్లో ఆమెకు ఎలాంటి హక్కులు ఉన్నాయి?అనే అంశాలు కీలకంగా మారనున్నాయి.

వీటన్నింటినీ పరిశీలించిన తర్వాతే కోర్టు ఈ వివాదంపై నిర్ణయం తీసుకోనుంది.ఈ కేసులో వెలువడే తీర్పు కేవలం టీవీఎస్ కుటుంబ ఆస్తుల వివాదానికే పరిమితం కాకుండా,దేశంలోని ఇతర పెద్ద వ్యాపార కుటుంబాల్లోనూ వారసత్వ ఆస్తుల పంపకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ముఖ్యంగా కుటుంబ వ్యాపారాల్లో కుమార్తెల హక్కులు,పిత్రార్జిత ఆస్తుల విభజన, ఫ్యామిలీ ట్రస్టుల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి భవిష్యత్తులో తలెత్తే వివాదాలకు ఈ తీర్పు మార్గదర్శకంగా నిలవవచ్చు.

ADVERTISEMENT