UBS: 2027 నాటికి UBS మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. క్రెడిట్ సూయిజ్‌ను గడిచిన ఏడాది తన అధీనంలోకి తీసుకున్న అనంతరం ఖర్చుల నియంత్రణ చర్యలను వేగవంతం చేస్తూ, 2027 నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేల ఉద్యోగాలను తగ్గించే యోచనలో ఉందని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'సోంటాగ్స్‌బ్లిక్' పేర్కొంది. ప్రస్తుతం యూబీఎస్‌లో సుమారు 1 లక్షా 10 వేల మంది పనిచేస్తుండగా, ఈ తాజా కోతలు అమలైతే మొత్తం సిబ్బందిలో తొమ్మిది శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ విషయాన్ని బ్యాంక్ యాజమాన్యం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
వివరాలు
గత ఏడాది జూన్‌లో రెండు బ్యాంకుల విలీనం
ఉద్యోగాల తొలగింపును ప్రత్యక్షంగా చేపట్టకుండా, సహజంగా సంస్థను విడిచిపెట్టేవారు, ముందస్తు పదవీ విరమణ తీసుకునేవారు, అలాగే అంతర్గత బదిలీల ద్వారానే ఎక్కువ ఖాళీలను భర్తీ చేయాలని యూబీఎస్ భావిస్తోంది. 2023లో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన క్రెడిట్ సూయిజ్‌ను యూబీఎస్ రక్షించి స్వాధీనం చేసుకున్న నాటి నుంచే వ్యయ నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో రెండు బ్యాంకుల విలీనం పూర్తయిన వేళ మొత్తం సిబ్బంది సంఖ్య 1 లక్షా 19 వేల మందికి పైగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అది 1 లక్షా 4 వేల వరకు పడిపోయింది. దీంతో ఇప్పటికే సుమారు 15 వేల ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆందోళనలో యూబీఎస్ సిబ్బంది
ఇదివరకే స్విట్జర్లాండ్‌లో సుమారు 3 వేల ఉద్యోగాలను తొలగిస్తామని యూబీఎస్ ప్రకటించింది. ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బ్యాంక్ తాజాగా మరోమారికి స్పష్టం చేసింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకున్న అతిపెద్ద విలీనంగా గుర్తింపు పొందిన ఈ ఒప్పందంతో, 167 ఏళ్ల చరిత్ర కలిగిన క్రెడిట్ సూయిజ్ పేరు శాశ్వతంగా అంతరించిపోయింది. ఇప్పుడు మరో దశగా ఉద్యోగ కోతలు చేపట్టనున్న నేపథ్యంలో యూబీఎస్ సిబ్బందిలో ఆందోళన నెలకొంది.