Union Budget: ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం: కేంద్ర బడ్జెట్‌లో రూ.25 వేల కోట్ల ఫండ్ వచ్చే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆగిపోయిన మౌలిక సదుపాయాల (ఇన్‌ఫ్రా) ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఫైనాన్సింగ్‌లో ఉన్న అడ్డంకులను తొలగించే భాగంగా రూ.25వేల కోట్ల రిస్క్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఫండ్ ఏర్పాటుపై కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. చిన్న వ్యాపారాల కోసం ఇప్పటికే అమలులో ఉన్న క్రెడిట్ గ్యారంటీ పథకాల మాదిరిగానే ఈ భద్రతా వ్యవస్థను రూపొందించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ఈ ఫండ్‌ను ప్రకటించే అవకాశముందని సమాచారం.
వివరాలు
కొంతకాలంగా మందగించిన ఇన్‌ఫ్రా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు
ఈ ప్రతిపాదనను నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (నాబ్‌ఫిడ్) కింద ఏర్పాటైన కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ పథకం అమలులోకి వస్తే,నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్‌సీజీటీసీ) ద్వారా అభివృద్ధి సంబంధిత రిస్క్‌లకు గ్యారంటీలు ఇవ్వనున్నారు. దీని వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరింత సడలింపులతో రుణాలు ఇవ్వగలుగుతాయని అంచనా. ప్రాజెక్టు ఆలస్యాలు,ఖర్చుల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు వంటి కారణాలతో ఇన్‌ఫ్రా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు కొంతకాలంగా మందగించాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే సుమారు 2.2 ట్రిలియన్ డాలర్ల మేర మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
ఫండ్‌పై ప్రభుత్వంలో కొంతకాలంగా చర్చలు
ఈ నేపథ్యంలో కొత్త ఫండ్ కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. ప్రతిపాదిత ఫండ్ ద్వారా ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలకు కొంతమేర గ్యారంటీ ఇస్తారు. దీనికిగాను నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. దీంతో రుణదాతలకు ఉన్న రిస్క్ తగ్గి, రుణాల ప్రవాహం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ఫండ్‌పై ప్రభుత్వంలో కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రారంభ నిధులను కేంద్ర బడ్జెట్ ద్వారా సమకూర్చాలని, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2000లో ప్రారంభించిన సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్రెడిట్ గ్యారంటీ పథకం తరహాలోనే ఈ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తున్నారు.
వివరాలు
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం రూ.11.21 లక్షల కోట్లు
2025 డిసెంబర్ 25న ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం, నాబ్‌ఫిడ్‌కు పంపిన ప్రశ్నలకు ప్రెస్ టైమ్ వరకు స్పందన రాలేదని నివేదిక పేర్కొంది. అయితే ఈ పథకం అమలైతే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు రిస్క్ తగ్గి, పోటీ వడ్డీ రేట్లతో ఎక్కువ రుణాలు ఇవ్వడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రిస్క్ అంచనాలు సరిగ్గా చేయడం, కఠినమైన రుణ ప్రమాణాలు పాటించడం చాలా అవసరమని వారు హెచ్చరిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం రూ.11.21 లక్షల కోట్లుగా నిర్ణయించింది. ఇది జీడీపీలో సుమారు 3.1 శాతం.
వివరాలు
రోడ్లు, హైవేల రంగంలో ప్రాజెక్టుల ఆలస్యాలు, ఖర్చుల పెరుగుదల
గత బడ్జెట్‌లో ఇది రూ.11.11 లక్షల కోట్లు, అంటే సుమారు 3.4 శాతం. ప్రభుత్వ ఖర్చులు పెరిగినా, బాహ్య పరిస్థితులు, ప్రాజెక్టు స్థాయి సమస్యలు ఇంకా ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి. గ్రాంట్ థార్న్టన్ భారత్‌కు చెందిన వివేక్ అయ్యర్ మాట్లాడుతూ, పెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంలో వెనుకడుగు వేయడానికి వృద్ధి అవకాశాలకన్నా పాలసీ అనిశ్చితి, వాణిజ్యేతర రిస్క్‌లే ప్రధాన కారణమని అన్నారు. రూ.25 వేల కోట్ల రిస్క్ గ్యారంటీ ఫండ్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంగా రూపొందిస్తే, ఇది మంచి క్రెడిట్ మద్దతు సాధనగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్లు, హైవేల రంగంలో ప్రాజెక్టుల ఆలస్యాలు, ఖర్చుల పెరుగుదల ఇంకా పెద్ద సమస్యగానే ఉన్నాయి.
వివరాలు
ఆలస్యమైనా 253 ప్రాజెక్టులు
గత ఐదేళ్లలో మంజూరైన 574 జాతీయ రహదారి ప్రాజెక్టులు గడువు మించాయని కేంద్ర రవాణా శాఖ రాజ్యసభలో వెల్లడించింది. వీటి మొత్తం వ్యయం సుమారు రూ.3.60 లక్షల కోట్లు. వీటిలో 300కు పైగా ప్రాజెక్టులు ఏడాది వరకు ఆలస్యం కాగా, 253 ప్రాజెక్టులు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు ఆలస్యమయ్యాయి. మరో 21 ప్రాజెక్టులు మూడేళ్లకుపైగా వెనుకబడ్డాయి. అదనంగా, సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయంతో 133 హైవే ప్రాజెక్టులు మంజూరైనా, భూమి సమస్యలు, అటవీ-వన్యప్రాణి అనుమతుల ఆలస్యం, ఫైనాన్షియల్ క్లోజర్ జాప్యం, కాంట్రాక్టర్ల బ్యాంక్ గ్యారంటీలు సమర్పించకపోవడం వంటి కారణాలతో పనులు మొదలుకాలేదని నివేదిక పేర్కొంది.