LOADING...
UPI: సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు.. డిజిటల్‌ దిశగా కీలక అడుగు
సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు.. డిజిటల్‌ దిశగా కీలక అడుగు

UPI: సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు.. డిజిటల్‌ దిశగా కీలక అడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు)లో యూపీఐ (UPI) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో సోమవారం నుంచి ఈ డిజిటల్‌ సేవలను ప్రారంభించారు. ఇప్పటి వరకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి చెల్లింపులు చేయడం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ సౌకర్యాలు వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వినియోగదారులకు మాత్రమే పరిమితమయ్యాయి. సహకార బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులకు ఈ సదుపాయాలు లేకపోవడంతో, ముఖ్యంగా పొగాకు, ఆయిల్‌పామ్‌, కోకో పంటలు పండించే రైతులు వాణిజ్య బ్యాంకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వారి సరకుల విక్రయ లావాదేవీలు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంతోనే అనుసంధానమై ఉన్నాయి.

Details

ఉన్నతాధికారులతో సమీక్షా

ఈ నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో యూపీఐ సేవలు ప్రారంభించే అంశంపై ఏప్కాబ్‌ (APCOB) ఛైర్మన్‌ గన్ని వీరాంజనేయులు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. తొలుత తన సొంత జిల్లా అయిన ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచే ఈ డిజిటల్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సహకార సంఘాలు, బ్యాంకులు పారదర్శకంగా పనిచేయాలన్న లక్ష్యంతో వాటిలో లావాదేవీలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేసింది. దీని వల్ల ఆన్‌లైన్‌ సేవలను అమలు చేయడానికి అవసరమైన మార్గం సుగమమైంది.

Details

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు

ఇకపై సహకార బ్యాంకుల ఖాతాదారులు మొబైల్‌ ఫోన్ల ద్వారా తక్షణమే డబ్బులు పంపడం, స్వీకరించడం చేయగలుగుతారు. బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా నగదు రహిత లావాదేవీలను వినియోగించుకునే అవకాశం లభించనుంది. ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ యూపీఐ సేవలను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సహకార బ్యాంకుల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement