UPI Turns Ten: యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 13 వేల రెట్ల వృద్ధితో డిజిటల్ విప్లవం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ దిశగా మలచడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐకి ఈ నెల 25తో పదేళ్లు పూర్తికానున్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) నియంత్రణ, పర్యవేక్షణలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ వ్యవస్థను రూపొందించింది. ఫోన్ నంబర్లు, క్యూఆర్ కోడ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారులకు రియల్‌టైమ్‌లో చెల్లింపులు చేసే అవకాశం యూపీఐ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దశాబ్ద కాలంలో ఈ వ్యవస్థ దేశ డిజిటల్ చెల్లింపుల విధానాన్నే పూర్తిగా మార్చేసింది.
వివరాలు
13 వేల రెట్లు పెరిగిన లావాదేవీలు
కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా జరిగిన వార్షిక లావాదేవీలు 1.78 కోట్లుగా ఉన్నాయి.
2025-26 నాటికి ఈ సంఖ్య ఏకంగా 24,162 కోట్లకు పైగా చేరింది. అంటే పదేళ్ల వ్యవధిలో లావాదేవీల సంఖ్య దాదాపు 13 వేల రెట్లు పెరిగింది.
లావాదేవీల విలువలోనూ భారీ వృద్ధి నమోదైంది. 2016-17లో యూపీఐ లావాదేవీల విలువ రూ.7 వేల కోట్లుగా ఉండగా.. 2025-26 నాటికి అది దాదాపు రూ.314 లక్షల కోట్లకు చేరింది.
వివరాలు
జులైలో సరికొత్త గరిష్ఠం
యూపీఐ వినియోగం నెలనెలా భారీగా పెరుగుతోంది.
ఈ ఏడాది మేలో నెలవారీ లావాదేవీల సంఖ్య తొలిసారిగా 2,300కోట్ల మార్కును దాటి 2,320కోట్లకు చేరుకుంది.
జులైలో మరోసారి రికార్డు నమోదైంది. ఆ నెలలో ఏకంగా 2,366కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి.
పదేళ్ల చరిత్రలో ఇదే అత్యధిక నెలవారీ లావాదేవీల సంఖ్య.ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 66 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థ
లావాదేవీల సంఖ్య పరంగా యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థగా నిలిచింది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)కూడా ఈ విషయాన్ని గుర్తించింది. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన రియల్‌టైమ్ పేమెంట్ లావాదేవీల్లో దాదాపు 49శాతం వాటా యూపీఐదే కావడం దీని విస్తృతిని తెలియజేస్తోంది.
వివరాలు
11 దేశాల్లో సేవలు
దేశీయ అవసరాల కోసం ఆవిష్కరించిన యూపీఐ.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ విస్తరిస్తోంది.
ప్రస్తుతం యూఏఈ, ఫ్రాన్స్, భూటాన్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖతార్, కంబోడియా, గ్రీస్, మాల్దీవుల్లో యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.
దీంతో భారత్ రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగింది.
వివరాలు
మరిన్ని మార్పులకు సిద్ధం
రాబోయే దశాబ్దంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ మరిన్ని కీలక మార్పులకు నాంది పలకనుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
కొత్త వినియోగదారులు, వ్యాపారులను యూపీఐ పరిధిలోకి తీసుకురావడంతో పాటు.. నిరంతర సాంకేతిక మార్పులు, పురోగతికి అనుగుణంగా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.
దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు యూపీఐను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.