Layoffs: అమెరికా ఉపాధి రంగంలో కలకలం.. జులైలో 23 వేల ఉద్యోగాల కోత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఉపాధి రంగంలో సవాళ్లు కొనసాగుతున్నాయి. జులై నెలలో అక్కడి వాణిజ్య సంస్థలు 23,000 ఉద్యోగాలను తొలగించాయి. గత నెలలో లక్ష కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అంచనా వేసినప్పటికీ.. అందుకు భిన్నంగా తాజా గణాంకాలు వెలువడ్డాయి. అమెరికా ఉపాధి మార్కెట్‌లో నెలకొన్న సవాళ్లతో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం కూడా ఉద్యోగాల కోతకు కారణమైనట్లు తెలుస్తోంది.
వివరాలు
రెండు నెలల్లో లక్షకుపైగా ఉద్యోగాల కోత
అమెరికా కార్మిక శాఖ మే, జూన్ నెలలకు సంబంధించిన గత ఉద్యోగ గణాంకాలను కూడా సవరించింది.
ఈ రెండు నెలల లెక్కల్లో అదనంగా 1,03,000 ఉద్యోగాలను తగ్గించింది.
దీంతో అమెరికా ఉపాధి మార్కెట్ గతంలో అంచనా వేసిన దానికంటే బలహీనంగా ఉన్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
నిరుద్యోగిత రేటు 4.1 శాతానికి తగ్గినా..
మరోవైపు అమెరికాలో నిరుద్యోగిత రేటు జూన్‌లో ఉన్న 4.2 శాతం నుంచి జులైలో 4.1 శాతానికి తగ్గింది. అయితే ఈ తగ్గుదల ఉపాధి మార్కెట్ మెరుగుపడిందనే సంకేతం కాదని గణాంకాలు సూచిస్తున్నాయి.
జులైలో సుమారు 2,64,000 మంది అమెరికన్లు ఉద్యోగాల కోసం వెతకడాన్ని నిలిపివేశారు. దీంతో వారు లేబర్ మార్కెట్ నుంచి వైదొలిగారు.
ఉద్యోగాల్లో ఉన్నవారు లేదా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి వాటా 61.4 శాతానికి పడిపోయింది. ఇది 2021 ఫిబ్రవరి తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.
ఉద్యోగాల అన్వేషణను పెద్ద సంఖ్యలో అమెరికన్లు నిలిపివేయడంతో నిరుద్యోగిత రేటు తగ్గినప్పటికీ.. వాస్తవానికి లేబర్ మార్కెట్‌లో పాల్గొనే వారి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.