America's business schools: అమెరికా బిజినెస్ పాఠశాలల్లో ఫీజులలో భారీ డిస్కౌంట్లు!..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని పలు వ్యాపార విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులను భారీగా తగ్గిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. కృత్రిమ మేధ ప్రభావంతో ఉద్యోగ రంగంలో అనిశ్చితి పెరగడం వల్ల వ్యాపార విద్యా కోర్సులపై ఆసక్తి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంబీఏ చదవాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు తమ నిర్ణయాలను మళ్లీ పరిశీలిస్తున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక 'ది వాల్‌స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అనేక విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్, ప్రత్యేక నైపుణ్యాల ఆధారిత, ఉన్నతాధికారుల కోసం రూపొందించిన వ్యాపార విద్యా కోర్సుల ఫీజులను దాదాపు సగం వరకు తగ్గించాయి. అలాగే తక్కువ వ్యవధిలో పూర్తయ్యేలా, ఉద్యోగాలతో పాటు అభ్యసించగలిగే విధంగా సౌకర్యవంతమైన కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
వివరాలు
ఉద్యోగం కొనసాగిస్తూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికే చాలామంది ఆసక్తి
ఉద్యోగ మార్పు కోరుకునే వారు, ఉన్నత నాయకత్వ స్థానాలను లక్ష్యంగా పెట్టుకునే వారికి ఎంబీఏ కోర్సులు చాలాకాలంగా ప్రధాన ఎంపికగా కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉద్యోగాల కోతలు, కొత్త నియామకాల మందగమనం కారణంగా ఇప్పటికే చేస్తున్న స్థిరమైన ఉద్యోగాలను వదిలేయడానికి పలువురు వృత్తినిపుణులు వెనుకంజ వేస్తున్నారు. ప్రవేశాలపై సలహాలు అందించే 'మై ఎంబీఏ పాథ్' సంస్థ వ్యవస్థాపకురాలు పెటియా వైట్‌మోర్ మాట్లాడుతూ.. రెండేళ్లపాటు వ్యాపార విద్యాసంస్థల్లో చదవడంపై కంటే ఉద్యోగం కొనసాగిస్తూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికే చాలామంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఇది ఉద్యోగ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంకేతమని పేర్కొన్నారు.
వివరాలు
తగ్గిన విదేశీ విద్యార్థుల నుంచి వ్యాపార విద్యాసంస్థలకు వచ్చే దరఖాస్తులు
గతంలో నియామకాలు విస్తృతంగా సాగిన సమయంలో వృత్తినిపుణులు తరచూ ఉద్యోగాలు మారేవారని, ప్రస్తుతం మాత్రం చాలా సంస్థలు కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా వినియోగంలోకి తెస్తుండటంతో ఉద్యోగ భద్రతపైనే ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారని కథనం వెల్లడించింది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసా నిబంధనలు కఠినతరం కావడం, అక్కడి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల విదేశీ విద్యార్థుల నుంచి వ్యాపార విద్యాసంస్థలకు వచ్చే దరఖాస్తులు కూడా తగ్గినట్లు ఆ కథనం పేర్కొంది.