Petrol Prices: 2027 వరకు ఇంధన ధరలు ఎక్కువగానే?.. అమెరికా ఇంధనశాఖ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన Strait of Hormuz జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి చర్చలు రెండోసారి జరిగినప్పటికీ స్పష్టత రాకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈపరిణామాల మధ్య అమెరికా ఇంధన శాఖ మంత్రి Chris Wright కీలక వ్యాఖ్యలు చేశారు. 2027వరకు అమెరికాలో పెట్రోలు ధరలు అధికంగానే కొనసాగే అవకాశముందని చెప్పారు. ఒక గ్యాలన్ పెట్రోలు ధర 3డాలర్లకు పైగానే ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. అయితే ఈ ఏడాది చివరినాటికి ధరలు 3 డాలర్ల కంటే తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, వివాదం పరిష్కారం కాలేకపోతే వచ్చే ఏడాది వరకూ కూడా తగ్గకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
అమెరికాలో ఒక గ్యాలన్ పెట్రోలు ధర సగటున 4.05 డాలర్లు
పరిస్థితులు సర్దుబాటు అయితేనే ధరలు క్రమంగా తగ్గుతాయని స్పష్టం చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలోని నేతలు కూడా ధరలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ, ఈ ఏడాది వేసవి కాలంలో ధరలు 3 డాలర్లకు దిగొచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ఒక గ్యాలన్ పెట్రోలు ధర సగటున 4.05 డాలర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ధర 3.16 డాలర్లుగా ఉండేది. సాధారణంగా ముడి చమురు ఎగుమతి చేసే దేశమైన అమెరికాలోనే ధరలు ఇంతగా పెరగడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే దిగుమతులపై ఆధారపడిన ఇతర దేశాలపై మరింత భారంగా మారే అవకాశముంది.
వివరాలు
భగ్గుమన్న చమురు ధరలు
హర్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు ఆరు శాతం పెరిగి 95.89డాలర్లకు చేరుకుంది. మరోవైపు యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధరలు కూడా ఏడు శాతానికి పైగా పెరిగి 90.13డాలర్లకు నమోదయ్యాయి. ఇదే సమయంలో Iranకు చెందిన తౌస్కా అనే వాణిజ్య నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నాయి. Gulf of Omanలో జరిగిన ఈ ఘటనను ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా ధృవీకరించారు. ఈ ఘటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.తమ ఐఆర్‌జీసీ దళాలు అమెరికా యుద్ధ నౌకలపై డ్రోన్లను ప్రయోగించాయని ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది. ఈపరిణామాలన్నీ కలిసి ప్రాంతంలో ఉద్రిక్తతలను ఒక్కసారిగా మరింత పెంచాయి.