US Visa: అమెరికా వీసా రెన్యువల్‌కు కఠిన నిబంధనలు.. ఇక సుదీర్ఘకాలం వేచి ఉండాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వీసా రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నవారికి చేదు వార్త..!
వీసాల పునరుద్ధరణకు అమల్లో ఉన్న 'డ్రాప్‌బాక్స్' విధానాన్ని మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.
తాజా మార్పుల ప్రకారం, ఇకపై గత 12 నెలల్లో గడువు ముగిసిన వీసాలకే ఇంటర్వ్యూలేకుండా రెన్యువల్ అవకాశముంటుంది.
ఇంతకుముందు ఈ గడువు 48 నెలలు ఉండేది. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.
అయితే,దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ,ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో ఈ మార్పులను అమలు చేస్తున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి.
ముఖ్యంగా హెచ్-1బీ, బీ1/బీ2 వంటి నాన్‌ఇమిగ్రెంట్ వీసాదారులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. వీసా రెన్యువల్ కోసం వారు మరింత ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
వివరాలు
మళ్లీ పాత నిబంధనలనే..
ఇప్పటివరకు ఉన్న విధానంలో గత 48 నెలల్లో గడువు ముగిసినవారు డ్రాప్‌బాక్స్ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అవసరం లేకుండా వీసా రెన్యువల్ చేసుకునే వీలుండేది.
అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చి, గత 12 నెలల్లో గడువు ముగిసినవారికి మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంచారు.
అంటే, ఒకవేళ వీసా గడువు ముగిగి 12 నెలలకుపైగా అయిందనుకుంటే, ఇకపై మళ్లీ కొత్తగా ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సిందే.
కోవిడ్ మహమ్మారి ముందు వరకు కూడా ఇదే 12 నెలల నిబంధన అమలులో ఉండేది.
అయితే, వీసా అప్లికేషన్‌ల పెరుగుదల దృష్ట్యా 2022లో అమెరికా ప్రభుత్వం డ్రాప్‌బాక్స్ సౌకర్యాన్ని 48 నెలలకు పెంచింది. అయితే ఇప్పుడు మళ్లీ పాత నిబంధనలనే అమల్లోకి తెచ్చారు.
వివరాలు
భారతీయులపై తీవ్ర ప్రభావం
ఈ మార్పుల వల్ల భారతీయ వీసా దరఖాస్తుదారులపై ఎక్కువ ప్రభావం పడనుంది.
ఇప్పటికే ఢిల్లీ, ముంబయి వంటి నగరాల్లో బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూలకు 440 రోజులకు పైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
తాజా మార్పుల కారణంగా మరింత మంది ఇంటర్వ్యూకు రావాల్సి వస్తే, వీసా మంజూరు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.
వృత్తినిపుణులు, వ్యాపార ప్రయాణికులు డ్రాప్‌బాక్స్‌పై ఎక్కువగా ఆధారపడటంతో, హెచ్-1బీ వీసా రెన్యువల్ కోసం కూడా వారు కొత్తగా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.