Indian solar imports: భారత సౌర ఉత్పత్తులపై అమెరికా 123% యాంటీ-డంపింగ్ సుంకం.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా భారతదేశం నుంచి దిగుమతి అయ్యే సౌర సెల్స్, మాడ్యూల్స్‌పై భారీగా 123 శాతం యాంటీ-డంపింగ్ సుంకం విధించేందుకు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23న అమెరికా వాణిజ్య శాఖ ఈ ప్రకటన చేసింది. భారత కంపెనీలు తక్కువ ధరలకు ఉత్పత్తులు విక్రయిస్తున్నాయని ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఇండోనేషియా, లావోస్ దేశాలపై కూడా వరుసగా 35% ,22% సుంకాలు విధించారు. గత ఏడాది ఈ మూడు దేశాల నుంచే అమెరికాకు దాదాపు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సౌర దిగుమతులు జరిగాయి. యాంటీ-డంపింగ్ సుంకం అంటే విదేశాల నుంచి వస్తువులు అసలు ధర కంటే తక్కువ ధరకు అమ్మినప్పుడు, స్థానిక పరిశ్రమలకు నష్టం కలగకుండా అదనంగా విధించే పన్ను.
వివరాలు
ఎగుమతిదారులపై అదనపు ఆర్థిక భారం
అమెరికా ఇప్పటికే ఫిబ్రవరిలో కౌంటర్‌వేలింగ్ సుంకాలు కూడా విధించడంతో, మొత్తం సుంకభారం 200 శాతానికి పైగా చేరింది. దీంతో భారత కంపెనీలకు అమెరికా మార్కెట్‌లో పోటీ చేయడం కష్టంగా మారింది. ఈ నిర్ణయం ప్రధానంగా అదానీ గ్రూప్‌కు చెందిన ముండ్రా సోలార్,ప్రీమియర్ ఎనర్జీస్ వంటి కంపెనీలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే పంపిన సరుకులపైనా 90రోజుల ముందు నుంచి సుంకం వర్తించవచ్చని అమెరికా తెలిపింది. దీంతో ఎగుమతిదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత కంపెనీలు యూరప్, పశ్చిమ ఆసియా మార్కెట్లపై దృష్టి పెడుతున్నాయి. అలాగే దేశీయంగా పునరుత్పాదక శక్తి లక్ష్యాలు కూడా కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం జూలై, అక్టోబర్ నెలల్లో వచ్చే అవకాశం ఉంది.