Loading...
Godavari: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!
భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!

Godavari: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతమైన కాళేశ్వరం వైపు నుంచి భారీగా వరదనీరు రావడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 30 అడుగులుగా ఉండగా, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు అది 53 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక (చివరి హెచ్చరిక) జారీ చేశారు. శనివారం ఉదయానికి నీటిమట్టం మరింత పెరిగి 55.1 అడుగులకు చేరింది. వరద పరిస్థితులను జిల్లా కలెక్టర్ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌రాజ్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

వివరాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అలాగే వాగులు, వరద ప్రవాహాలను దాటకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

గోదావరి వరద ఉద్ధృతి కారణంగా దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య రాకపోకలు శుక్రవారం సాయంత్రం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి.

దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా నీటమునిగాయి. సీతవాగు వద్ద ఉన్న సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్‌ ఫుట్‌ బ్రిడ్జి కూడా వరద నీటిలో మునిగిపోయాయి.

తూరుబాక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హై లెవల్‌ వంతెనకు ఇరువైపులా ఉన్న అప్రోచ్‌ రోడ్లు వరద ప్రవాహానికి కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వివరాలు

క్వారీలోనే చిక్కుకుపోయిన 30పైగా లారీలు

మరోవైపు, ఎగువ నుంచి అకస్మాత్తుగా భారీ వరద రావడంతో చర్ల మండలంలోని వీరాపురం శివారులో ఉన్న ఇసుక క్వారీలో దాదాపు 44 మంది లారీ డ్రైవర్లు, స్థానికులు చిక్కుకుపోయారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

అయితే 30కు పైగా లారీలు మాత్రం ఇంకా క్వారీలోనే చిక్కుకుపోయాయి. క్వారీలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నంలో సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి తెప్పపై వెళ్లారు.

ఈ క్రమంలో ఇద్దరూ వరద ప్రవాహంలో పడిపోయినా, ఈదుకుంటూ తిరిగి తెప్పపైకి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ADVERTISEMENT