USA-Israel: ఇరాన్ ఎనర్జీ మౌలిక సదుపాయాలే టార్గెట్..? అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు రంగం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్నాయి. కొంతకాలంగా ఘర్షణలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా, తాజాగా పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. హర్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతోందని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ నౌకలపై దాడులు కొనసాగిస్తోందని సమాచారం. దీనిని కారణంగా చూపుతూ అమెరికా టెహ్రాన్‌పై భీకర దాడులు చేపడుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రస్తుతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్‌పై మరింత దూకుడుగా వ్యవహరించేందుకు అమెరికా కొత్త కార్యాచరణను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
వివరాలు
అమెరికాకు మద్దతుగా నిలిచే అవకాశం
ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా అమెరికాకు మద్దతుగా చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అమెరికా అధికారులను ఉటంకిస్తూ వెలువడిన నివేదికల ప్రకారం, ఇరాన్‌లోని కీలక విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టే అంశాన్ని వాషింగ్టన్ పరిశీలిస్తోంది.
ముఖ్యంగా పవర్ ప్లాంట్లు, చమురు రిఫైనరీలను టార్గెట్ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాల సామర్థ్యాన్ని దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే ఈ దాడులు చేపట్టాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇప్పటివరకు తుది అనుమతి లభించలేదని సమాచారం.