Loading...
Jana Nayagan: కావేరీ వివాదం ఎఫెక్ట్‌.. 'జన నాయగన్' ప్రదర్శన నిలిపివేత
కావేరీ వివాదం ఎఫెక్ట్‌.. 'జన నాయగన్' ప్రదర్శన నిలిపివేత

Jana Nayagan: కావేరీ వివాదం ఎఫెక్ట్‌.. 'జన నాయగన్' ప్రదర్శన నిలిపివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

కావేరీ జలాల వివాదం మరోసారి కర్ణాటక-తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ కమిటీ (CWRC) ఆదేశించడంతో కర్ణాటకలో నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ముఖ్యంగా మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు, కన్నడ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. మండ్యలో నిరసనకారులు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా పోస్టర్లను చించివేశారు. అంతేకాకుండా ఆ చిత్రం ప్రదర్శితమవుతున్న గురుశ్రీ థియేటర్‌ను ముట్టడించి సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

వివరాలు

జిల్లా కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో థియేటర్ యాజమాన్యం ప్రదర్శనను నిలిపివేసినట్లు సమాచారం. అనంతరం కార్యకర్తలు థియేటర్‌ బయట నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు.

నిరసనలో భాగంగా తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయవద్దని కోరుతూ జిల్లా కలెక్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు.

ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర తాగునీటి కొరత నెలకొందని, ప్రజలకు, పశువులకు సరిపడా నీరు కూడా అందుబాటులో లేదని వారు పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీటిని కూడా తమిళనాడుకు విడుదల చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వివరాలు

ఈ  సమస్యను పరిష్కరించాలి

మండ్య ప్రజలు ఎప్పుడూ కర్ణాటక ప్రయోజనాల కోసం ముందుండి పోరాడారని, ఈ సమస్యను ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని పరిష్కరించాలని నిరసనకారులు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం నీటిని విడుదల చేస్తే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరోవైపు మైసూరు-బెంగళూరు జాతీయ రహదారిపై సర్‌ ఎం. విశ్వేశ్వరయ్య విగ్రహం సమీపంలో నిరసనకారులు రోడ్డును దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ముందుజాగ్రత్త చర్యగా నిర్బంధించారు.

ఇక మైసూరులో కూడా నిరసనకారులు ఖాళీ కుండలతో ప్రదర్శనలు నిర్వహిస్తూ, కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ADVERTISEMENT