LOADING...
crude oil: వెనెజువెలా వైపు భారత్ చూపు.. పెరిగిన చమురు దిగుమతులు

crude oil: వెనెజువెలా వైపు భారత్ చూపు.. పెరిగిన చమురు దిగుమతులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో అనిశ్చితి నెలకొంది. పలుదేశాలు చమురు కొరత, పెరుగుతున్న ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తక్కువ ధరకు లభిస్తున్న వెనెజువెలా ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకుంటోంది. జాతీయ మాధ్యమాల కథనాల ప్రకారం.. మే నెలలో సౌదీ అరేబియా, అమెరికా తర్వాత భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా వెనెజువెలా నిలిచింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులను భారత్ సమర్థంగా వినియోగించుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

భారతీయ రిఫైనరీలను ఆకర్షిస్తున్న వెనెజువెలా చమురు

ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ నెలలో ఇప్పటివరకు వెనెజువెలా నుంచి భారత్ రోజుకు సుమారు 4 లక్షల 17 వేల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఏప్రిల్‌లో ఈ పరిమాణం రోజుకు 2 లక్షల 83 వేల బ్యారెళ్లుగా నమోదైంది.ప్రస్తుతం భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా, యూఏఈ ముందంజలో ఉన్నప్పటికీ.. వెనెజువెలా నుంచి వచ్చే చమురు వేగంగా ప్రాధాన్యం పెంచుకుంటోంది. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే వెనెజువెలా చమురు తక్కువ ధరకు అందుబాటులో ఉండటం భారతీయ రిఫైనరీలను ఆకర్షిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అంతరాయాల భయం,అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది.

వివరాలు 

వెనెజువెలా కీలక సరఫరాదారు 

ఈ క్రమంలో వెనెజువెలా కీలక సరఫరాదారుగా మారుతోంది. వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందంజలో ఉంది. ఆ దేశం ఉత్పత్తి చేసే అధిక సల్ఫర్ కలిగిన ముడి చమురును శుద్ధి చేయడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ అనుకూలంగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇతర రిఫైనరీలు ఈ రకమైన చమురును పరిమిత స్థాయిలో మాత్రమే శుద్ధి చేయగలవు. అయితే రిలయన్స్ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక సామర్థ్యాల కారణంగా తక్కువ ధరకు లభిస్తున్న ఈ దిగుమతుల ద్వారా కంపెనీకి అధిక లాభాలు చేకూరుతున్నాయి.

Advertisement