Vistara : మన దేశంలో నవంబర్ 11న విస్తారా ప్రయాణానికి ముగింపు
మనదేశంలో ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా' తన పదేళ్ల ప్రయాణానికి ముగింపు పలకనుంది. ఈ సంస్థ ఎయిరిండియాలో విలీనమయ్యేందుకు భారత ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం వల్ల ఈ పరిణామం చోటుచేసుకుంది. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్తంగా నడుపుతున్న విస్తారా, తన బ్రాండ్ కింద చివరి విమానాన్ని నవంబరు 11న నడపనుంది. ఆ తర్వాత, నవంబరు 12 నుంచి, ఈ సంస్థ విమానాలు ఎయిరిండియా బ్రాండ్ కింద మాత్రమే సేవలు అందించనుంది. ఈ మేరకు నవంబర్ 11 వరకు ప్రయాణించబోయే విమానాలకు విస్తారా వెబ్‌సైట్‌లో బుకింగ్‌లు కొనసాగుతాయి.
ఎయిరిండియా నిర్వహణలోకి విస్తారా
అయితే, నవంబరు 12న మొదలయ్యే ప్రయాణాల కోసం సెప్టెంబరు 3 నుంచి అన్ని బుకింగ్‌లు ఎయిరిండియా వెబ్‌సైట్‌కు మళ్లుతాయని విస్తారా పేర్కొంది. విలీనంతో, విస్తారా సిబ్బంది, విమానాలు ఎయిరిండియా నిర్వహణలోకి వెళ్లనున్నాయి. 2025 ప్రారంభం వరకు ఎటువంటి మార్పులు ఉండవని, అదే షెడ్యూల్ కింద సేవలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ విలీనంతో ఎయిరిండియా గ్రూప్ ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన గ్రూప్‌లలో ఒకటిగా మారనుంది, 23,000 మందికి పైగా ఉద్యోగులు ఇందులో ఉండనున్నారు. విలీన ప్రతిపాదనలో భాగంగా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో రూ. 2,058.5 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టడానికి కేంద్రం ఇటీవల అనుమతినిచ్చింది.