Volkswagen: వోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం.. 1,00,000 ఉద్యోగాలపై వేటు
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించుకోనుంది. ఈ దశాబ్దం ముగిసేలోగా ఏకంగా లక్ష ఉద్యోగాలకు కోత పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సంస్థ ప్రకటించింది. తొలుత 50 వేల ఉద్యోగాలను తగ్గించాలని భావించిన ఫోక్స్‌వ్యాగన్.. ఇప్పుడు అదనంగా మరో 50 వేల ఉద్యోగాల కోత ప్రణాళికకు కూడా ఆమోదం తెలిపింది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను సర్దుబాటు చేయడం తప్పనిసరిగా మారిందని యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా నిలిచే అవకాశం ఉంది.
వివరాలు
వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో సుమారు 6.67 లక్షల మంది ఉద్యోగులు
ప్రస్తుతం వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో సుమారు 6.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వీరిలో దాదాపు 43 శాతం మంది జర్మనీలోనే విధులు నిర్వహిస్తున్నారు.
ఈ లెక్కన లక్ష ఉద్యోగాల కోత అంటే సంస్థ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 15 శాతం మందిపై ప్రభావం పడనుంది.
ఉద్యోగాల తగ్గింపును కార్మిక సంఘాలు గతంలో తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజా ప్రకటనలో ఈ పునర్వ్యవస్థీకరణకు కార్మిక సంఘాలు కూడా అంగీకరించినట్లు కంపెనీ పేర్కొనడం గమనార్హం.
అదే సమయంలో జర్మనీలోని నాలుగు ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసే ప్రణాళికను కూడా ఫోక్స్‌వ్యాగన్ వెల్లడించింది.
వివరాలు
ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంపై వోక్స్‌వ్యాగన్ దృష్టి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అవుతున్న భారీ ఖర్చులు, చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల వల్ల ఏర్పడుతున్న ఒత్తిళ్లు.. ఈ కఠిన నిర్ణయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
మారుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌లో పోటీని తట్టుకోవడంతో పాటు సంస్థ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంపై వోక్స్‌వ్యాగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ పరిధిలో పలు ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్లు ఉన్నాయి. ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ వంటి ప్యాసింజర్ వాహన బ్రాండ్లతో పాటు స్కానియా, డుకాటీ వంటి కమర్షియల్, ద్విచక్ర వాహన బ్రాండ్లను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది.
వివరాలు
భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు
ఆటోమొబైల్ రంగంలో గతంలోనూ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు చోటుచేసుకున్నాయి.
2009లో జనరల్ మోటార్స్ దివాలా తీసినట్లు ప్రకటించిన అనంతరం సుమారు 50 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
అయితే ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించిన లక్ష ఉద్యోగాల కోత ఆ సంఖ్యను అధిగమించనుంది.
దీంతో ఆటో పరిశ్రమ చరిత్రలో ఇది అత్యంత భారీ ఉద్యోగాల తగ్గింపు, పునర్వ్యవస్థీకరణల్లో ఒకటిగా నిలవనుంది.