LOADING...
Credit card settlement:క్రెడిట్‌ కార్డ్‌ సెటిల్‌మెంట్‌ అంటే ఏమిటి? స్కోరు ప్రభావం తెలుసుకోండి!
క్రెడిట్‌ కార్డ్‌ సెటిల్‌మెంట్‌ అంటే ఏమిటి? స్కోరు ప్రభావం తెలుసుకోండి!

Credit card settlement:క్రెడిట్‌ కార్డ్‌ సెటిల్‌మెంట్‌ అంటే ఏమిటి? స్కోరు ప్రభావం తెలుసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వ్యక్తుల ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు అనుకోకుండా అప్పులు పేరుకుపోయి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. అలాంటి సమయంలో రుణభారం తగ్గించుకోవడానికి చాలామంది 'సెటిల్‌మెంట్‌' మార్గాన్ని ఎంచుకుంటారు. తాత్కాలికంగా మానసిక ప్రశాంతత కలిగించే ఈ నిర్ణయం... దీర్ఘకాలంలో మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సెటిల్‌మెంట్‌ అంటే ఏమిటి? భవిష్యత్‌లో రుణాలు, క్రెడిట్‌ స్కోరుపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? చూద్దాం.

Details

సెటిల్‌మెంట్‌ అంటే ఏమిటి?

ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రెడిట్‌ కార్డు బిల్లులు లేదా రుణాల ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి వస్తే... రుణగ్రహీత తన పరిస్థితిని రుణదాతకు వివరించి ఒక అవగాహనకు రావడం సెటిల్‌మెంట్‌ అని అంటారు. అంటే తీసుకున్న మొత్తం రుణం కంటే తక్కువ మొత్తాన్ని చెల్లించి ఖాతాను ముగించడం. ఉదాహరణకు, మీరు లక్ష రూపాయలు క్రెడిట్‌ కార్డు ద్వారా ఖర్చు చేశారని అనుకుందాం. కానీ అనూహ్య పరిస్థితుల వల్ల మొత్తం చెల్లించలేకపోతే... బ్యాంకుతో చర్చించి కొంత మొత్తం తగ్గించి చెల్లించేందుకు ఒప్పందం చేసుకోవచ్చు. నిర్ణయించిన గడువులో ఆ మొత్తాన్ని చెల్లించాలి. అయితే, ఇక్కడితో కథ ముగిసిందని భావించకూడదు. అసలు ప్రభావం అప్పుడే మొదలవుతుంది.

Details

క్రెడిట్‌ స్కోరుపై తీవ్రమైన ప్రభావం

సెటిల్‌మెంట్‌ చేసుకోవడం అంటే పూర్తి రుణాన్ని తీర్చినట్లుకాదు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ ఖాతాను 'సెటిల్డ్‌'గా క్రెడిట్‌ బ్యూరోలకు నివేదిస్తాయి. ఇది క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సాధారణంగా రుణ పరిమాణాన్ని బట్టి 75 నుంచి 150 పాయింట్ల వరకు క్రెడిట్‌ స్కోరు పడిపోవచ్చు. అంతేకాదు, సెటిల్‌మెంట్‌ సమాచారం ఏడేళ్ల పాటు క్రెడిట్‌ రికార్డులో కనిపిస్తుంది. ఈ కారణంగా భవిష్యత్‌లో రుణాలు పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా అధిక వడ్డీ రేట్లు విధించే అవకాశం ఉంది.

Advertisement

Details

ఎప్పుడు ఈ మార్గం ఎంచుకోవాలి?

అప్పుల ఒత్తిడిలో నుంచి తక్షణ ఉపశమనం పొందేందుకు సెటిల్‌మెంట్‌ ఉపకరిస్తుంది. కానీ దీని వల్ల మీ ఆర్థిక విశ్వసనీయత దెబ్బతింటుందనే విషయం గుర్తుంచుకోవాలి. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటేనే ఈ నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఆర్థిక నిపుణులు సెటిల్‌మెంట్‌ను చివరి ఆప్షన్‌గా మాత్రమే పరిగణించాలని సూచిస్తున్నారు.

Advertisement

Details

సెటిల్‌మెంట్‌ తర్వాత క్రెడిట్‌ స్కోరు పెంచుకోవచ్చా?

సెటిల్‌మెంట్‌ వల్ల పడిపోయిన క్రెడిట్‌ స్కోరును తిరిగి మెరుగుపరుచుకునే మార్గాలు ఉన్నాయి. తీసుకున్న బాకీలను సమయానికి చెల్లించాలి. ప్రతి ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు బిల్లును గడువు లోపే క్లియర్‌ చేయాలి. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో 30 శాతానికి లోపే ఉండేలా జాగ్రత్తపడాలి. తరచుగా కొత్త రుణాల కోసం దరఖాస్తులు చేయడం తగ్గించాలి. హోమ్‌లోన్‌, గోల్డ్‌లోన్‌ వంటి సెక్యూర్డ్‌ లోన్లు తీసుకుని సమయానికి చెల్లించడం ద్వారా విశ్వసనీయత పెంచుకోవచ్చు. క్రెడిట్‌ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించి పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. ఈ సూచనలు పాటిస్తే క్రమంగా క్రెడిట్‌ స్కోరు మెరుగవుతుంది.

Advertisement