Nvidia CEO Succession: జెన్సన్ హువాంగ్ తప్పుకుంటే...ఎన్వీడియాను ఎవరు నడిపిస్తారు?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నిఘా వర్గాలు చైనా కోసం గూఢచర్యం చేశారనే అనుమానం వ్యక్తం చేసిన మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని జెన్సన్ హువాంగ్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎన్విడియా బోర్డు విచారణ చేపట్టింది. అయితే, జాతీయ భద్రతకు లేదా కంపెనీ రహస్యాలకు ముప్పు వాటిల్లినట్లు భావించడానికి ఎలాంటి కారణం లేదని బోర్డు స్పష్టం చేసింది. హువాంగ్‌పై తనకు నమ్మకం ఉందని కూడా ప్రకటించింది. అయినప్పటికీ, ఆయన స్థానంలో మరొకరు వస్తే కంపెనీని ఎవరు ముందుకు తీసుకెళ్తారనే ప్రశ్న మొదలైంది.
Details
రెండో స్థానంలో ఎవరున్నారు?
సీఎన్‌బీసీ కథనం ప్రకారం, ఎన్విడియా రోజువారీ కార్యకలాపాలు, వ్యూహాత్మక నిర్ణయాల్లో హువాంగ్‌దే ప్రధాన పాత్ర.
కంపెనీలో ఆయన తర్వాత అంతటి బాధ్యతలు చేపట్టగల రెండో స్థాయి నాయకుడు ఎవరనే విషయంలో స్పష్టత లేదు.
మెలియస్ రీసెర్చ్ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరో పదేళ్ల పాటు హువాంగ్ సీఈఓగా కొనసాగుతారని తాము భావించామని, కానీ ఆయనకు స్పష్టమైన వారసుడు లేకపోవడం కంపెనీకి కీలకమైన సమస్యగా మారవచ్చని పేర్కొన్నారు.
Details
33 మంది నేరుగా సీఈఓకే రిపోర్ట్!
హువాంగ్ నాయకత్వ శైలి కూడా ఈ చర్చకు కారణమవుతోంది. సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, ఈ వారం నాటికి 33 మంది ఉన్నతాధికారులు నేరుగా ఆయనకే నివేదిస్తున్నారు.
వీరిలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కొలెట్ క్రెస్, చీఫ్ సైంటిస్ట్ బిల్ డాలీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డ్వైట్ డియెర్క్స్, CUDA సాఫ్ట్‌వేర్ సృష్టికర్త ఇయాన్ బక్ ఉన్నారు.
అయితే, 2025 సెప్టెంబర్‌లో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు 60 మంది వరకు నేరుగా రిపోర్ట్ చేస్తారని హువాంగ్ వెల్లడించారు. అంటే కీలక నిర్ణయాలు, విభాగాల పనితీరు ఆయన పర్యవేక్షణలోనే సాగుతున్నాయి.
Details
కంపెనీకి వారసత్వ ప్రణాళిక ఎంత ముఖ్యం?
ఎన్విడియాలో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ, ప్రెసిడెంట్‌గా ఉన్న హువాంగ్‌కు కంపెనీ మొత్తం షేర్లలో 3 శాతానికి కొద్దిగా ఎక్కువ వాటా మాత్రమే ఉంది.
ఆయన 11 మంది సభ్యుల బోర్డులో ఒకరు. ఆ బోర్డుకు అధికారిక ఛైర్మన్ కూడా లేరు.
మరోవైపు, సరైన వారసత్వ ప్రణాళిక లేకపోవడం, కీలక ఉద్యోగుల నుంచి బాధ్యతల బదిలీ సజావుగా జరగకపోవడం కంపెనీ వ్యూహాలు, పనితీరు, దీర్ఘకాలిక విజయాన్ని ప్రభావితం చేయవచ్చని ఎన్విడియా ఆర్థిక నివేదికలే హెచ్చరిస్తున్నాయి.
Details
బోర్డు విచారణ తర్వాత ఏం జరగనుంది?
రోత్‌షిల్డ్ అండ్ కో రెడ్‌బర్న్ విశ్లేషకుడు టిమ్ షుల్జ్-మెలాండర్ అభిప్రాయం ప్రకారం, బోర్డు విచారణలో ప్రస్తుత వివాదం కంటే తీవ్రమైన అంశాలు బయటపడితే హువాంగ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
అయితే, ప్రస్తుతానికి ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఎన్విడియా భవిష్యత్తు హువాంగ్ నాయకత్వంతో ఎంతగా ముడిపడి ఉందో ఈ పరిణామాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి.