Home loan: డబ్బు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కొనడానికి... హోమ్ లోన్ ఎందుకు తీసుకుంటారో తెలుసా?
ప్రస్తుతం బ్యాంకులు అన్ని రకాల అవసరాలకు లోన్‌లు అందిస్తున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా లోన్‌లను పొందడం, విచారణ చేయడం సులువైంది. బ్యాంక్ లోన్‌ల ప్రయోజనాలను గురించి అవగాహన పెరగడంతో, ఎక్కువ మంది ఇవి సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇల్లు కొనుగోలు చేసేందుకు హోమ్ లోన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. హోమ్ లోన్‌లు ప్రాపర్టీని కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,ఇల్లు కొనేందుకు తగినంత డబ్బు ఉన్నవాళ్లు కూడా హోమ్ లోన్ తీసుకుంటున్నారు.
ప్రాపర్టీ వెరిఫికేషన్
ఎందుకంటే, ఒకేసారి చెల్లిస్తే, వడ్డీ ఆదా అవుతుంది కదా? అనుకుంటున్నారా? ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, హోమ్ లోన్‌తో ప్రాపర్టీ కొనడం మంచిది. దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో చూద్దాం. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంక్ ప్రాపర్టీపై లీగల్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. వివాదాలు లేదా చట్టపరమైన సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి ప్రాపర్టీ డాక్యుమెంట్లు, టైటిల్‌ను తనిఖీ చేస్తారు. ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా ఉంటే తప్ప బ్యాంకు లోన్ మంజూరు చేయదు. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ద్వారా, మీరు కొనుగోలు చేస్తున్న ప్రాపర్టీ సురక్షితంగా, చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఆదాయ పన్ను ప్రయోజనాలు
హోమ్ లోన్ తీసుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఆదాయ పన్ను ప్రయోజనాలు. ప్రభుత్వం అందించే పన్ను రాయితీలతో మీరు ప్రతి సంవత్సరం ఎంతో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇన్కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 24(బి) ప్రకారం, మీరు హోమ్ లోన్ కోసం చెల్లించే వడ్డీపై ప్రతి సంవత్సరం రూ.2 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. అలాగే, సెక్షన్ 80C కింద, మీరు చెల్లించిన ప్రిన్సిపల్ అమౌంట్‌పై రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు. మీరు కో-అప్లికెంట్‌తో (మీతో కలిసి దరఖాస్తు చేసిన మరొక వ్యక్తి) హోమ్ లోన్ తీసుకుంటే, మీరందరూ వేర్వేరు పన్ను ప్రయోజనాలు క్లెయిమ్ చేయవచ్చు. దీనివల్ల మొత్తం రూ.7 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
మహిళా కో-అప్లికెంట్‌కి తక్కువ వడ్డీ
మీరు మహిళా కో-అప్లికెంట్‌తో లోన్ కోసం దరఖాస్తు చేస్తే, కొన్ని బ్యాంకులు తక్కువ ఇంట్రెస్ట్ రేటును అందిస్తాయి. ఈ తగ్గింపు సాధారణంగా 0.05% ఉంటుంది. ఇది తక్కువ మొత్తంలో వడ్డీ తగ్గుతున్నట్లు అనిపించవచ్చు. కానీ, హోమ్ లోన్ టెన్యూర్ సాధారణంగా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. ఈ కాలంలో ఇంట్రెస్ట్ చెల్లింపులపై పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది.
టాప్-అప్ లోన్లు
టాప్-అప్ లోన్ అంటే, ఇప్పటికే ఉన్న హోమ్ లోన్‌పై మీరు తీసుకోనే అదనపు లోన్. సాధారణంగా ఇది వ్యక్తిగత లోన్ కంటే తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది. మీ ఇంటిని మోడరన్ చేయడం లేదా ఇంటీరియర్ ఫర్నిషింగ్‌కు టాప్-అప్ లోన్‌ను ఉపయోగించవచ్చు. టాప్-అప్ లోన్ రీపేమెంట్ పీరియడ్ మీ హోమ్ లోన్‌తో లింక్ అవుతుంది, దాన్ని తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం కూడా లభిస్తుంది.
ఇతర రుణాల కంటే తక్కువ ధర
పర్సనల్ లోన్ వంటి ఇతర లోన్‌లతో పోలిస్తే హోమ్ లోన్‌లు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లతో వస్తాయి. భవిష్యత్తులో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్లు మరింత తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వడ్డీలు తగ్గితే ఎక్కువ మంది ఇల్లు కొనుగోలు చేసేందుకు హోమ్ లోన్ తీసుకుంటారు. దీంతో తమ సేవింగ్స్‌ను బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. సేవింగ్స్ ఆర్థిక అత్యవసరాలు, పదవీ విరమణ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.