
2023లో వార్షిక వేతనాన్ని 50శాతం తగ్గించుకున్న విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన పారితోషికాన్ని దాదాపు 50 శాతం తగ్గించుకున్నారు.
2023 మార్చితో ముగిసే ఆర్థిక ఏడాదికి ఆయన వార్షిక వేతనం 951,353 డాలర్లు అందుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గతేడాది రిషద్ ప్రేమ్‌జీ 1,819,022 డాలర్ల పారితోషికాన్ని అందుకున్నారు.
కోవిడ్ ప్రారంభమైన ఏడాదిలో అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆయన తన వార్షిక వేతనాన్ని 31% తగ్గించుకున్నారు. విప్రో చైర్మన్ తన వేతనాన్ని తగ్గించుకోవడం ఇదే తొలిసారి.
ఇప్పుడు రెండోసారి ఏకంగా 50శాతం వరకు తన వేతనాన్ని తగ్గించుకున్నారు.
విప్రో
విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వేతనంలో 32శాతం కోత
రిషద్ ప్రేమిజీ తన పరిహారంతో పాటు, పెరుగుతున్న కన్సాలిడేటెడ్ నికర లాభాలపై 0.35 శాతం చొప్పున కమీషన్‌కు అర్హుడని ప్రముఖ మీడియా సంస్థ మింట్ నివేదించింది.
విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ ప్రవీణ్‌చంద్ర దలాల్ కూడా తన పరిహారంలో దాదాపు 32శాతం కోత విధించుకున్నట్లు తెలిసింది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 1.1 మిలియన్ డాలర్లను అందుకున్నారు. అంతకుముందు ఏడాది 1.6 మిలియన్ డాలర్ల(రూ.12.1 కోట్లు) పారితోషికం తీసుకున్నారు.
గత వారం క్యూ4 కోసం కంపెనీ తన ఉద్యోగులకు సగటు వేరియబుల్ చెల్లింపును కూడా విడుదల చేసింది. ఇది 80.2 శాతంగా ఉందని మీడియా నివేదికలు చెప్పాయి.