ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో పనితీరు బాగోలేదంటూ 452 మందిని ఇంటికి పంపిన విప్రో సంస్థ
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కార్పొరేట్ పేలవమైన పనితీరును పేర్కొంటూ 452 మంది కొత్త ఉద్యోగులను తొలగించింది. ఇటీవల జరిపిన ఇంటర్నల్ అస్సెస్ మెంట్ లో తక్కువ స్కోర్లు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నట్లు విప్రో తెలియజేసింది. మొదట విప్రో 800 మందిని తొలగించాలని అనుకున్నా, ఇప్పుడు తొలగించిన ఉద్యోగుల సంఖ్య అంతకంటే తక్కువే అని బిజినెస్ టుడే పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి కారణంగా చాలా టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించవలసి వచ్చింది.గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఆ లిస్ట్ లో ఉన్నాయి. తమ కంపెనీకి ప్రతి ఎంట్రీ-లెవల్ ఉద్యోగి వ్యాపార లక్ష్యాలు, క్లయింట్ అంచనాలకు అనుగుణంగా ఉండాలని కాబట్టే ఇలా చెయ్యాల్సి వచ్చిందని విప్రో పేర్కొంది.
ట్రైనింగ్ కు అయిన ఖర్చును మాఫీ చేస్తునట్టు మెయిల్ లో తెలిపిన విప్రో
452 మంది ఫ్రెషర్లు పదేపదే స్కోర్స్ సాధించడంలో విఫలమైన తర్వాత ఇలా తొలగించారు. ఇటీవల నిర్వహించిన అస్సెస్ మెంట్ లో అత్యల్ప స్కోరు సాధించిన వారిని మాత్రమే తొలగించినట్లు విప్రో పేర్కొంది. "జనవరి 2022లో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, కానీ చాలా నెలల ఆలస్యం తర్వాత, నన్ను ఆన్‌బోర్డ్ చేశారు. ఇప్పుడు పరీక్ష సాకుతో నన్ను ఉద్యోగంలో నుండి తొలగిస్తున్నారు" అని తొలగించిన ఒక ఫ్రెషర్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఉద్యోగులకు విప్రో టెర్మినేషన్ లెటర్ తో పాటు రూ. 75,000 వారికి శిక్షణ ఇచ్చేందుకు కంపెనీ ఖర్చు పెట్టిందని అయితే ఆ మొత్తాన్ని మాఫీ చేసినట్లు మెయిల్ లో తెలిపింది.