ఇక స్విగ్గీ వంతు, 380 మంది ఉద్యోగుల తొలగింపు
భారతదేశపు స్టార్టప్‌లలో ఒకటైన స్విగ్గీ ఉద్యోగ కోతలు మొదలుపెట్టింది. దాదాపు 380 మంది సిబ్బందిని తొలగించింది. దేశంలోని స్టార్టప్ వ్యవస్థను మరింతగా కుదిపేసే నిర్ణయం ఇది. ఈరోజు టౌన్ హాల్‌లో ఉద్యోగులకు ఈ తొలగింపుల గురించి సంస్థ తెలిపింది. రాబోయే మాంద్యం వలన కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి మధ్య పెట్టుబడిదారులు తమ డబ్బును ఆచితూచి ఖర్చు చేయడం ప్రారంభించారు. ఈ విధానం వల్ల భారతీయ స్టార్టప్‌లు భారీగా దెబ్బతిన్నాయి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో చాలా మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేశారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, దేశంలోని స్టార్టప్‌లు ఈ 2023లో ఇప్పటికే 1,000 మంది ఉద్యోగులను తొలగించాయి.
తొలగించిన ఉద్యోగులకు మూడు నుండి ఆరు నెలల జీతాన్ని అందిస్తున్న స్విగ్గి
ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, స్విగ్గి సీఈఓ శ్రీహర్ష మెజెటీ ఈ తొలగింపులు పునర్నిర్మాణ ప్రకియలో భాగమని తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు 3-6 నెలల జీతం వస్తుంది. ఈ చెల్లింపులో 100% వేరియబుల్ పే లేదా ఇన్సెంటివ్‌లు ఉంటాయి. వీరికి మే 31, 2023 వరకు వైద్య బీమా కవరేజీని, తర్వాత మూడు నెలల పాటు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్టు సంస్థ అందిస్తుంది. షేర్‌చాట్ పేరెంట్ సంస్థ మొహల్లా టెక్ కొన్ని రోజుల క్రితం సంస్థలో 20% ఉద్యోగులను తొలగించింది. స్విగ్గి ప్రత్యర్థి Dunzo కూడా 2023లో ఉద్యోగులను తొలగించింది. Edtech సంస్థలు LEAD School, Upgrad కూడా ఈ సంవత్సరం తమ సిబ్బందిలో కొంతమందిని తొలగించాయి.