ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ లో అగ్ర స్థానంలో నిల్చిన అర్బన్ కంపెనీ
భారతదేశంలో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావంతో, గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది. అయినా సరే, వీరికి ఇప్పటికీ సరైన వేతనం, మిగిలిన సౌకర్యాలు అందడంలేదని తెలుస్తుంది. ఫెయిర్‌వర్క్ ఇండియా రేటింగ్స్ 2022 ప్రకారం, ఓలా, ఉబెర్, Dunzo తో సహా కొన్ని అతిపెద్ద కంపెనీలు గిగ్ వర్కర్ల విషయంలో సున్నా స్కోర్ చేశాయి. అయితే అర్బన్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. గిగ్ వర్కర్లు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. కిరాణా సామాను ఆర్డర్ చేయడం దగ్గర్నుంచి అవి తీసుకురావడం వంటి వాటికి వారిపైనే ఆధారపడతాం. అయినప్పటికీ, వారికి మెరుగైన వేతనం లభించడంలేదు. ఫెయిర్‌వర్క్ ఇండియా 2022: ప్లాట్‌ఫారమ్ ఎకానమీలో లేబర్ స్టాండర్డ్స్ పేరుతో 12 భారతీయ ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలించింది.
గిగ్ వర్కర్లకు అనుకూలంగా టాప్ 2 లో బిగ్ బాస్కెట్ సంస్థ
సరైన వేతనం, షరతులు, కాంట్రాక్ట్స్, అనుకూలమైన మేనేజ్‌మెంట్ తో పాటు సరైన రిప్రజెంటేషన్ అనే ఐదు సూత్రాల ఆధారంగా కంపెనీలకు స్కోర్స్ వేశారు. సెంటర్ ఫర్ ఐటీ అండ్ పబ్లిక్ పాలసీ (CITAAP), ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగుళూరు , ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. నివేదిక ప్రకారం, అర్బన్ కంపెనీ 7పాయింట్లతో 1వ స్థానంలో నిలిచింది. బిగ్‌బాస్కెట్ 6పాయింట్లతో 2వ స్థానంలో, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గి చెరో 5పాయింట్లతో తర్వాతి స్థానాల్లో, ఆ తర్వాత స్థానంలో Zomato నిల్చింది. Amazon Flex, Dunzo, ఓలా, PharmEasy, ఉబెర్ 10కి సున్నా స్కోర్‌తో అట్టడుగున ఉన్నాయి.