World Bank: వాతావరణ మార్పుల ఎఫెక్ట్.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు పెరుగుతున్న ప్రమాదం.. ప్రపంచ బ్యాంక్ కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లోని విమానాశ్రయాల్లో రాబోయే సంవత్సరాల్లో విమాన సర్వీసులకు అంతరాయాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. అయితే దీనికి కారణం సాంకేతిక లోపాలు లేదా ప్రయాణికుల రద్దీ కాదు.. పెరుగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలేనని తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా 2030 నాటికి దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏడాదిలో పలుమార్లు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే లేదా దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. 'ఎ లివబుల్ ఫ్యూచర్: ఎ న్యూ క్లైమేట్ రియాలిటీ ఫర్ సౌత్ ఏషియన్ సిటీస్' పేరుతో విడుదలైన ఈ నివేదికలో దక్షిణాసియాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రవాణా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
వివరాలు
గాలి సాంద్రత తగ్గితే.. విమానయానంపై తీవ్ర ప్రభావం
రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల మౌలిక వసతులు వేడి కారణంగా దెబ్బతింటున్నాయని వెల్లడించింది.
విమానయాన రంగంలో తీవ్ర వేడి కారణంగా గాలిలో సాంద్రత తగ్గిపోతుంది.
దీంతో విమానాలకు అవసరమైన లిఫ్ట్ తగ్గడంతో పాటు ఇంజిన్ పనితీరు కూడా ప్రభావితమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితంగా టేకాఫ్ చేయడానికి విమానయాన సంస్థలు ప్రయాణికుల సంఖ్యను తగ్గించడం, సరుకు రవాణాను పరిమితం చేయడం లేదా అదనపు ఇంధనం వినియోగించడం వంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చని నివేదిక తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏడాదిలో పలుమార్లు 50 డిగ్రీల సమీపంలో లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే ప్రధాన విమానాశ్రయాల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఒకటిగా ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
వివరాలు
ఎండలతో రహదారులు, రన్‌వేలకు భారీ నష్టం
తీవ్ర ఎండల ప్రభావం ఇప్పటికే రవాణా మౌలిక వసతులపై కనిపిస్తోందని నివేదిక వివరించింది.
తగిన ప్రమాణాల బిటుమెన్ ఉపయోగించని రహదారులు, విమానాశ్రయ రన్‌వేలు అధిక ఉష్ణోగ్రతలతో మెత్తబడటం, ఆకారాన్ని కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
2024లో బంగ్లాదేశ్‌లో ఎండల కారణంగా జాతీయ రహదారులు కరిగిపోయిన ఘటనను ఉదాహరణగా పేర్కొంది.
అలాగే భారతదేశంలోని ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన రెండేళ్లలోనే నాణ్యతలేని తారు వినియోగం వల్ల తీవ్ర గుంతలు, గీతలు ఏర్పడ్డాయని గుర్తుచేసింది.
రైల్వే పట్టాలు అధిక వేడితో పొడవై వంకర తిరిగే ప్రమాదం ఉండటంతో రైళ్ల వేగాన్ని తగ్గించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపింది.
వివరాలు
ఎండలతో మారుతున్న ప్రయాణ అలవాట్లు.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం
తీవ్ర ఉష్ణోగ్రతలు కేవలం మౌలిక వసతులనే కాకుండా ప్రజల ప్రయాణ అలవాట్లను కూడా మార్చేస్తున్నాయని నివేదిక పేర్కొంది.
ఎండలు ఎక్కువగా ఉన్న రోజుల్లో చాలామంది ప్రయాణాలను వాయిదా వేయడం లేదా ప్రజా రవాణాకు బదులుగా వ్యక్తిగత వాహనాలను వినియోగించడం పెరుగుతోందని తెలిపింది.
దీంతో బస్సులు, మెట్రో సేవల ప్రయాణికుల సంఖ్య, ఆదాయంపై ప్రభావం పడుతోందని వెల్లడించింది.
రవాణా రంగంలో పనిచేసే సిబ్బందిపై కూడా వేడి ప్రభావం చూపుతోందని నివేదిక పేర్కొంది.
వేడి కారణంగా డ్రైవర్లు, ఇతర ఉద్యోగులు అనారోగ్యానికి గురవడంతో సేవల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని తెలిపింది.
కోల్‌కతాలో తీవ్ర ఎండల సమయంలో డ్రైవర్ల ఆరోగ్య సమస్యలు, మధ్యాహ్నం ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో బస్సు సర్వీసుల సమయాలను మార్చాల్సి వచ్చినట్లు వివరించింది.
వివరాలు
తీవ్రవేడితో ఎక్కువగా ఇబ్బంది పడేది పేదలేనట!
పేదవర్గాల ప్రజలే తీవ్రవేడి ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారని నివేదిక తెలిపింది.
ముంబైలో 63శాతం పేద కుటుంబాలకు చెందిన ఉద్యోగులు పనికి నడిచి వెళ్తుండగా,ఢిల్లీ మెట్రో అధ్యయనం ప్రకారం ప్రయాణికులు తమ మొత్తం ప్రయాణ సమయంలో సగటున 38 శాతం సమయాన్ని నడకలోనే గడుపుతున్నట్లు వెల్లడైంది.
దీంతో వారు తీవ్ర ఎండలకు ఎక్కువసేపు గురవుతున్నారని నివేదిక పేర్కొంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ రవాణా వ్యవస్థలను వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రపంచ బ్యాంక్ సూచించింది.
బస్ స్టాప్‌ల వద్ద నీడ కల్పించడం,బస్సులు,మెట్రో బోగీల్లో మెరుగైన గాలి ప్రసరణ ఏర్పాటు చేయడం,తాగునీటి సౌకర్యం కల్పించడం వంటి చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రవాణా వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయని సూచించింది.