Airport: ప్రపంచ టాప్ ఎయిర్‌పోర్ట్స్ జాబితా రిలీజ్.. దిల్లీ ర్యాంక్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్‌లోని ఛాంగి ఎయిర్‌పోర్ట్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్-2026 ప్రకారం, వరుసగా రెండో ఏడాది కూడా ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలవడం విశేషం. ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్షిణ కొరియాలోని ఇన్చాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సాధించగా, మూడో స్థానంలో జపాన్‌కు చెందిన టోక్యో హనేడా ఎయిర్‌పోర్ట్ నిలిచింది. అలాగే టాప్-10లో హాంకాంగ్ విమానాశ్రయం, జపాన్‌లోని నరీటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఫ్రాన్స్‌లోని పారిస్ షార్ల్ ద గోల్ ఎయిర్‌పోర్ట్, ఇటలీలోని రోమ్ విమానాశ్రయం, టర్కియేలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్, జర్మనీలోని మ్యూనిక్ ఎయిర్‌పోర్ట్, కెనడాలోని వ్యాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లు చోటు దక్కించుకున్నాయి.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగామూడో స్థానం
భారత్ విషయానికి వస్తే, దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఈసారి ప్రపంచ జాబితాలో 28వ స్థానాన్ని సాధించింది. గత ఏడాది ఇది 32వ స్థానంలో ఉండగా, ఈసారి నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుంది. దేశంలోనే కాకుండా దక్షిణాసియాలో కూడా ఉత్తమ విమానాశ్రయంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ టాప్-30 విమానాశ్రయాల్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక విమానాశ్రయం ఇదే కావడం గమనార్హం. అదనంగా, సంవత్సరానికి 7 కోట్లకు పైగా ప్రయాణికులను సేవలందిస్తున్న విమానాశ్రయాల విభాగంలో దిల్లీ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానాన్ని పొందింది.