YesMadam: చిన్న కారణంతో.. ఏకంగా 100 మంది వరకు ఉద్యోగుల తొలగింపు.. అదిరిపోయిన ట్విస్ట్
ఒకప్పటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆదాయ వనరులు పెరిగాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి. కానీ అదే సమయంలో ఉద్యోగ భద్రతపై నమ్మకం తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే అనిశ్చిత పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం కరోనా మహమ్మారి సమయంలో సృష్టించిన ఆర్థిక విపత్తు దీని కోసం ఉదాహరణగా నిలిచింది. ఆ సమయంలో అనేక కంపెనీలు మూతపడగా,వేలాది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత నుంచి ఆర్థిక మందగమనం పేరుతో లేదా ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తరచుగా తొలగించడం ప్రారంభించాయి. పనితీరు సరిపోకపోవడం,అంచనాలు అందుకోలేకపోవడం,లాభాల తగ్గుదల వంటి కారణాలతో లేఆఫ్స్ జరుగుతుండగా,తాజాగా 'YES MADAM'అనే స్టార్టప్ తీసుకున్న నిర్ణయం భిన్నంగా నిలిచింది.
హెచ్ఆర్ మేనేజర్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం
నోయిడాలో ప్రధాన కార్యాలయంతో పనిచేస్తున్న 'YES MADAM' అనే ఇంటి వద్ద సెలూన్ సేవలు అందించే స్టార్టప్, ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఉద్యోగులను తొలగించిందన్న వార్తలు వెలుగుచూశాయి. ఒక అంతర్గత సర్వే నిర్వహించి, ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించిన కంపెనీకి, చాలా మంది ఒత్తిడిలో ఉన్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఉద్యోగుల అభిప్రాయాలను గౌరవిస్తూ, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి వీడ్కోలు చెప్పడం తప్పనిసరని తెలిపింది.
లేఆఫ్స్ జరగలేదు, ఉద్యోగులకు విరామం ఇచ్చాం
ఈ ఈమెయిల్ స్క్రీన్‌షాట్ ట్విట్టర్‌లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. 'YES MADAM' సంస్థ స్పందిస్తూ, లేఆఫ్స్ జరగలేదని, ఉద్యోగులకు విరామం ఇచ్చామని వెల్లడించింది. ఒత్తిడి గురించి చర్చించడానికే సర్వే నిర్వహించామని, ఉద్యోగులను తొలగించడం లక్ష్యం కాదని స్పష్టంచేసింది. సంస్థ తీసుకున్న ఈ వివరణపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.