Loading...
APY: అటల్ పెన్షన్ యోజనకు యువత క్యూ.. 18-25 ఏళ్ల వారే ఎందుకు ముందున్నారు?
అటల్ పెన్షన్ యోజనకు యువత క్యూ.. 18-25 ఏళ్ల వారే ఎందుకు ముందున్నారు?

APY: అటల్ పెన్షన్ యోజనకు యువత క్యూ.. 18-25 ఏళ్ల వారే ఎందుకు ముందున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2026
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుండగా,అసంఘటిత రంగ కార్మికులు,స్వయం ఉపాధి పొందేవారికి కూడా వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన (APY)ను అమలు చేస్తోంది. బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా కలిగిన వారు ఈ పథకంలో చేరి నెలవారీ చందా చెల్లిస్తే, 60 ఏళ్ల వయసు తర్వాత ప్రతి నెలా రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ పథకంపై యువత ఆసక్తి గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే అత్యధికంగా APYలో చేరుతున్నారు.

వివరాలు 

పదేళ్లలో దాదాపు తొమ్మిది రెట్లు పెరుగుదల నమోదు 

2015-16లో ప్రారంభమైన తొలి ఏడాదిలో ఈ వయస్సు వారిలో 7.23లక్షల మంది మాత్రమే సభ్యులుగా చేరగా,2024-25 నాటికి ఆ సంఖ్య 54.47లక్షలకు చేరింది.

అంటే పదేళ్లలో దాదాపు తొమ్మిది రెట్లు పెరుగుదల నమోదైంది.

ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 1.35కోట్ల మంది ఈ పెన్షన్ పథకంలో చేరారు.

పథకం ప్రారంభమైనప్పటి నుంచి 2026 మే నెల వరకు దేశవ్యాప్తంగా మొత్తం 9.10కోట్ల మంది సభ్యులయ్యారు.

సభ్యులు చెల్లించిన మొత్తం చందాల విలువ రూ.54వేల కోట్లకు చేరింది.

రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తర్‌ప్రదేశ్‌లో 1.16కోట్ల మంది సభ్యులతో మొదటి స్థానంలో ఉండగా,బిహార్‌లో 70 లక్షలు,మహారాష్ట్రలో 58 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షలు, తెలంగాణలో 28 లక్షల మంది ఈ పథకంలో చేరారు.

వివరాలు 

యువత ఎందుకు ఎక్కువగా చేరుతోంది?

అటల్ పింఛన్ యోజనలో ఎంత చిన్న వయసులో చేరితే, అంత తక్కువ నెలవారీ చందాతో భవిష్యత్‌లో పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.

అందుకే 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకాన్ని ఎక్కువగా ఎంచుకుంటోంది.

ఉదాహరణకు, నెలకు రూ.1,000 పెన్షన్ పొందాలనుకునే వ్యక్తి 18 ఏళ్ల వయసులో పథకంలో చేరితే నెలకు రూ.42 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అదే 25 ఏళ్ల వయసులో చేరితే రూ.76, 30 ఏళ్లకు చేరితే రూ.116, 40 ఏళ్ల వయసులో చేరితే రూ.291 నెలవారీ చందా చెల్లించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

యువత ఎందుకు ఎక్కువగా చేరుతోంది?

అంటే వయస్సు పెరిగే కొద్దీ చందా కూడా పెరుగుతుంది. అందువల్ల తక్కువ మొత్తంతో దీర్ఘకాలిక పెన్షన్ భద్రత పొందాలనే ఉద్దేశంతో యువత ముందుగానే ఈ పథకంలో చేరుతోంది.

ఈ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం కుటుంబ భద్రత. చందాదారు మరణిస్తే, అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్ కొనసాగుతుంది.

ఒకవేళ ఇద్దరూ మరణిస్తే, నామినీకి గరిష్ఠంగా రూ.8.50 లక్షలు చెల్లించే నిబంధన ఉంది.

దీంతో వృద్ధాప్య ఆర్థిక భద్రతతో పాటు కుటుంబానికి కూడా రక్షణ కల్పించే పథకంగా అటల్ పింఛన్ యోజనకు ఆదరణ పెరుగుతోంది.

ADVERTISEMENT