Narayana Murthy: యువత ఎక్కువ గంటలు పనిచేయాలి.. చైనా పద్ధతిని గుర్తుచేసిన నారాయణ మూర్తి!
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మరోసారి భారత వర్క్ కల్చర్‌పై చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించి సంచలనం రేపిన ఆయన, ఈసారి చైనా అనుసరించిన కఠినమైన '9-9-6' పని విధానాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. చైనా ఆర్థిక ఎదుగుదల వెనుక వారి కఠోర వర్క్ ఎథిక్ ముఖ్య కారణమని పేర్కొన్నారు. చైనా టెక్ కంపెనీల్లో ఒకప్పుడు అమల్లో ఉన్న '9-9-6' విధానం అంటే — ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులపాటు పని చేయడం. అంటే మొత్తం 72 గంటల పని. ఇదే వారి వేగవంతమైన అభివృద్ధికి పునాది వేసిందని ఆయన అన్నారు.
Details
నిబద్ధత, క్రమశిక్షణ అవసరం
భారత్ తయారీ రంగంలో చైనాను అధిగమించే అవకాశాల గురించి వచ్చిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అది సాధ్యమే కానీ అత్యధిక స్థాయి నిబద్ధత, క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ భారతదానికంటే ఆరు రెట్లు పెద్దది. మనం 6.57% వృద్ధి సాధిస్తున్నా, వారితో పోటీ పడాలంటే ప్రతి పౌరుడు అసాధారణమైన కృషి చేయడం తప్పదని మూర్తి పేర్కొన్నారు. యువత వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై ఆలోచించే ముందు, తమ కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన మరోసారి హితవు పలికారు. ప్రతి ఒక్క పౌరుడు, అధికారి, రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త అందరూ తమ పనిలో ఉన్నత ప్రమాణాలు పాటించినప్పుడే భారత్ చైనాను చేరుకోగలదంటూ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.