Zepto: ఐపీఓకు ముందు జెప్టో వ్యవస్థాపకులకు ఈడీ నోటీసులు.. విదేశీ పెట్టుబడులపై విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
క్విక్ కామర్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న జప్టో (Zepto) సంస్థ సహ వ్యవస్థాపకులు ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రాలకు ఈ ఏడాది ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. విదేశీ పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కోరుతూ ఈడీ ఏప్రిల్ 8, 2026న ఈ సమన్లు పంపింది. విదేశీ పెట్టుబడులు,ఆర్థిక లావాదేవీలపై వివరాల సేకరణ ఈడీ జారీ చేసిన సమన్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఆడిట్ చేసిన ఆర్థిక నివేదికలు, షేర్ హోల్డింగ్ నమూనా,రుణాలు,గ్యారెంటీలు, ఆదాయపు పన్ను రిటర్నులు, బ్యాంకు ఖాతాల వివరాలు కోరింది. అలాగే సంస్థకు చెందిన స్థిరాస్తుల సమాచారం, జెప్టో వ్యాపార నమూనాపై పూర్తి నివేదికను కూడా సమర్పించాలని సూచించింది.
వివరాలు
పలుమార్లు ఈడీ ఎదుట హాజరైన వ్యవస్థాపకులు
జెప్టో సెబీకి సమర్పించిన తాజా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం, కైవల్య వోహ్రా ఏప్రిల్ 17, ఏప్రిల్ 22 తేదీల్లో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆదిత్ పాలిచా ఏప్రిల్ 20, మే 15న విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోల్డింగ్ నిర్మాణం, సింగపూర్ నుంచి భారత్‌కు విలీన ప్రక్రియ, వ్యాపార ఒప్పందాలు, ఇన్‌వాయిస్‌లు తదితర అవసరమైన అన్ని పత్రాలను ఈడీకి అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ సమన్లకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి అదనపు సమాచారం లేదా కొత్త నోటీసులు అందలేదని జెప్టో వెల్లడించింది.
వివరాలు
ఐపీఓకు ముందు ఆర్థిక ఫలితాల వెల్లడి
జెప్టో త్వరలో ఐపీఓ ద్వారా రూ.8,010 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సంస్థ తన తాజా ఆర్థిక ఫలితాలను కూడా ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.22,624 కోట్లకు చేరుకుంది. గత ఏడాది నమోదైన రూ.11,110 కోట్లతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా పెరిగింది. అయితే, కంపెనీ నికర నష్టం కూడా పెరిగి రూ.5,905 కోట్లకు చేరగా, 2024-25లో అది రూ.4,700 కోట్లుగా నమోదైంది.
వివరాలు
వ్యాపార విస్తరణతో పాటు నియంత్రణ సంస్థల సవాళ్లు
2021లో ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా స్థాపించిన జెప్టో ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద క్విక్ కామర్స్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఈ రంగంలో బ్లింకిట్,స్విగ్గీ ఇన్‌స్టామార్ట్,ఫ్లిప్‌కార్ట్ మినిట్స్,అమెజాన్ నౌ వంటి కంపెనీలతో జెప్టో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. అయితే వ్యాపార పోటీతో పాటు నియంత్రణ సంస్థల సవాళ్లూ ఎదురవుతున్నాయి. క్విక్ కామర్స్ రంగంలో అధిక డిస్కౌంట్లు,పోటీని దెబ్బతీసే ధరల విధానాలపై భారత పోటీ కమిషన్ (CCI) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విచారణలో జెప్టో పేరును కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా, అధిక డిస్కౌంట్ల కారణంగా క్విక్ కామర్స్ సంస్థల ఐపీఓలకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ సెబీకి లేఖ రాసిన విషయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.