LOADING...
Jepto: రూ.11,000 కోట్ల ఐపీఓ దిశగా జెప్టో అడుగులు
రూ.11,000 కోట్ల ఐపీఓ దిశగా జెప్టో అడుగులు

Jepto: రూ.11,000 కోట్ల ఐపీఓ దిశగా జెప్టో అడుగులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్విక్‌ కామర్స్‌ రంగంలో దూసుకెళ్తున్న జెప్టో పబ్లిక్‌ ఇష్యూ దిశగా అడుగులు వేస్తోంది. ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను రహస్య పద్ధతిలో సెబీకి సమర్పించినట్లు ఈ పరిణామాలను దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు వెల్లడించాయి. ఈ విధానంలో డాక్యుమెంట్లు దాఖలు చేయడంతో ఇష్యూ పరిమాణం, ఇతర కీలక వివరాలు ప్రస్తుతం బహిర్గతం కావు. అయితే ప్రతిపాదిత ఐపీఓ ద్వారా సుమారు రూ.11,000 కోట్ల నిధులను సమీకరించాలని జెప్టో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జూలై-సెప్టెంబర్‌ మధ్య పబ్లిక్‌ ఇష్యూ మార్కెట్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇది నిజమైతే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అయ్యే కొత్తతరం స్టార్టప్‌ల జాబితాలో జెప్టో కూడా చేరనుంది.

Details

2021లో జెప్టో స్థాపన

ఇప్పటికే ఇదే క్విక్‌ కామర్స్‌ విభాగంలో పోటీగా ఉన్న జొమాటో (ఎటర్నల్‌), స్విగ్గీ సంస్థలు మార్కెట్లో లిస్ట్‌ అయ్యాయి. ఎటర్నల్‌ బ్లింకిట్‌ పేరుతో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ పేరుతో క్విక్‌ డెలివరీ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. 10 నిమిషాల్లో నిత్యావసర సరుకులు అందించే కాన్సెప్ట్‌తో జెప్టోను 2021 జూలైలో అదిత్‌ పలిచా, కైవల్య వోహ్రా స్థాపించారు. తక్కువ కాలంలోనే ఈ సంస్థ తన కార్యకలాపాలను దేశంలోని ప్రధాన నగరాలకు వేగంగా విస్తరించింది. 2025 సెప్టెంబర్‌ నాటికి జెప్టోకు 900కు పైగా డార్క్‌ స్టోర్లు ఉన్నట్లు అంచనా. 2023లో యూనికార్న్‌ హోదాను సాధించిన ఈ స్టార్టప్‌ ప్రస్తుతం సుమారు 7 బిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు రూ.63,000 కోట్ల విలువైన సంస్థగా నిలిచింది.

Advertisement