
Zomato to Eternal: జొమాటో పేరు 'ఎటర్నల్'గా మార్పు.. ఆమోదించిన బోర్డు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato Ltd) తమ కంపెనీ పేరును మార్చింది. ఇకపై ఈ సంస్థ ఎటర్నల్ లిమిటెడ్ గా వ్యవహరించనుంది. ఈ పేరుకు అనుగుణంగా కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు. గత రెండు సంవత్సరాలుగా ఈ పేరును అంతర్గతంగా ఉపయోగిస్తూ వచ్చిన జొమాటో, తాజాగా అధికారికంగా పేరు మార్పును ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ, సహవ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ గురువారం వాటాదారులకు లేఖ ద్వారా తెలియజేశారు. బ్లింకిట్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి, తమ సంస్థను అంతర్గతంగా ఎటర్నల్ గా పిలుచుకుంటూ వచ్చినట్లు దీపిందర్ గోయల్ లేఖలో తెలిపారు.
వివరాలు
స్టాక్ మార్కెట్లో కంపెనీ టిక్కర్ కూడా జొమాటో నుంచి ఎటర్నల్ కు..
కంపెనీ బ్రాండ్, యాప్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పేరు మార్పు చేపట్టినట్లు వివరించారు. ఈ మార్పుతో, జొమాటో లిమిటెడ్ ఇకపై ఎటర్నల్ లిమిటెడ్‌గా మారబోతుంది, అయితే జొమాటో బ్రాండ్ లేదా యాప్ పేరు మాత్రం మారదు అని స్పష్టంగా వెల్లడించారు. పేరు మార్పుకు కంపెనీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపిందని, వాటాదారులు దీనికి సహకరించాలన్నారు. ఇకపై సంస్థ కార్పొరేట్ వెబ్‌సైట్ zomato.com నుంచి eternal.com కు మారుతుందని తెలిపారు. అంతేకాకుండా,స్టాక్ మార్కెట్లో కంపెనీ టిక్కర్ కూడా జొమాటో నుంచి ఎటర్నల్ కు మారనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కంపెనీ పరిధిలో జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ ప్యూర్ అనే వేర్వేరు వ్యాపారాలు కొనసాగుతున్నాయి.