Loading...
Eternal Shares: మార్చి కనిష్ఠాల నుంచి 71 శాతం పెరిగిన ఎటర్నల్ షేరు
మార్చి కనిష్ఠాల నుంచి 71 శాతం పెరిగిన ఎటర్నల్ షేరు

Eternal Shares: మార్చి కనిష్ఠాల నుంచి 71 శాతం పెరిగిన ఎటర్నల్ షేరు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తన రాత మార్చుకున్న ఎటర్నల్.. మార్చి కనిష్ఠాల నుంచి 71 శాతం పెరిగిన షేరు.. నిఫ్టీ 50లో టాప్ రికవరీ స్టాక్‌గా నిలిచింది. ఒకప్పుడు భారీగా పతనమైన ఈ స్టాక్ ఇప్పుడు మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగాల్లో కంపెనీ సాధిస్తున్న పురోగతి, క్యూ2 ఫలితాలు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో ఏ షేరు ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ముందుగా అంచనా వేయడం అంత సులభం కాదు. స్టాక్ ధరలపై అనేక అంశాలు ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా కంపెనీల పనితీరు, త్రైమాసిక ఫలితాలు, కొత్త ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు కీలక పాత్ర పోషిస్తాయి.

వివరాలు 

భారీగా పుంజుకున్న ఎటర్నల్

కంపెనీల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే వాటి షేర్లు పతనమవుతుంటాయి.

అదే మంచి ఫలితాలు సాధిస్తూ,భవిష్యత్తుపై సానుకూల అంచనాలు వ్యక్తం చేసే కంపెనీల షేర్లు అనూహ్యంగా పుంజుకుంటాయి.

ఆదాయ వృద్ధి అంచనాలను పెంచుకోవడం కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుంది.

ఇలాంటి స్టాక్స్‌లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో,క్విక్ కామర్స్ దిగ్గజం బ్లింకిట్ మాతృ సంస్థ ఎటర్నల్ ఒకటి. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ షేరు ఇటీవల భారీగా పుంజుకుంది.

క్విక్ కామర్స్ రంగంలో ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే మెరుగైన పురోగతి సాధించడం,రెండో త్రైమాసిక ఫలితాల్లో ఆకట్టుకునే పనితీరు కనబరచడం షేరుకు కలిసొచ్చాయి.

దీంతో 52వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుని నిఫ్టీ 50లో అత్యుత్తమ రికవరీ సాధించిన స్టాక్‌గా నిలిచింది.

వివరాలు 

ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న ఎటర్నల్ షేర్లు 

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో ఎటర్నల్ షేర్లు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు నెలకొన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి 13న షేరు ధర రూ.212.60కి పడిపోయి 52 వారాల కనిష్ఠాన్ని నమోదు చేసింది.

అయితే అక్కడి నుంచి అనూహ్యంగా పుంజుకుంది. కేవలం ఎనిమిది నెలలలోపే ఏకంగా 71 శాతం పెరిగింది.

సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎటర్నల్ షేరు రూ.363.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.366 స్థాయిని తాకి 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

గతంలో 2025 అక్టోబర్ 16న రూ.368.45 వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది.

ADVERTISEMENT

వివరాలు 

28 శాతం పెరిగిన ఎటర్నల్ షేరు

ప్రస్తుత జోరు కొనసాగితే త్వరలోనే ఆ రికార్డును కూడా అధిగమించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.3.29 లక్షల కోట్లుగా ఉంది.

మార్చిలో కనిష్ఠ స్థాయికి పడిపోయినప్పటి నుంచి ఎటర్నల్ షేరు క్రమంగా పుంజుకుంటూనే ఉంది.

ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 28 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 48 శాతం, నెల రోజుల్లో 12 శాతానికిపైగా రాణించింది.

ఏడాది కాలంలోనూ 20 శాతానికిపైగా రాబడిని అందించింది.

ADVERTISEMENT

వివరాలు 

అద్భుతమైన క్యూ2 ఫలితాలు

ఎటర్నల్ షేరు ర్యాలీకి కంపెనీ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు కూడా ప్రధాన కారణంగా నిలిచాయి.

ముఖ్యంగా క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ లాభదాయకత మెరుగుపడటం సానుకూల పరిణామం.

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 92 శాతానికిపైగా పెరిగి రూ.125 కోట్లకు చేరుకుంది.

కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 77 శాతం వృద్ధితో రూ.24,138 కోట్లుగా నమోదైంది. మరోవైపు బ్లింకిట్ కొత్త స్టోర్లను వేగంగా విస్తరిస్తోంది.

స్టోర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆర్డర్ల పరిమాణం కూడా మెరుగుపడుతోంది. ఫుడ్ డెలివరీ విభాగంలోనూ ఆర్డర్లు స్థిరంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

వివరాలు 

పూర్తి భిన్నంగా స్విగ్గీ షేర్లు

ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటున్న బ్రోకరేజీ సంస్థలు ఎటర్నల్ షేరుపై తమ టార్గెట్ ధరలను పెంచుతున్నాయి. దీంతో స్టాక్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఎటర్నల్ ప్రధాన ప్రత్యర్థి సంస్థ స్విగ్గీ షేర్ల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.

స్విగ్గీ రెండో త్రైమాసిక ఫలితాల్లో ఏకంగా రూ.922 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

ఈ ఫలితాలు వెలువడిన తర్వాత కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి.

బ్రోకరేజీ సంస్థలు కూడా టార్గెట్ ధరలను తగ్గించడంతో స్టాక్‌పై ఒత్తిడి పెరిగింది.

వివరాలు 

పూర్తి భిన్నంగా స్విగ్గీ షేర్లు

మరోవైపు ఎటర్నల్ రూ.125 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయగా, స్విగ్గీ మాత్రం ఇంకా లాభాల్లోకి రాలేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తోంది.

ఫలితంగా స్విగ్గీ షేరు నెల రోజుల్లో 18 శాతం, ఆరు నెలల్లో 28 శాతం తగ్గింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 52 శాతం పతనమైంది. ప్రస్తుతం స్విగ్గీ మార్కెట్ విలువ రూ.43.11 వేల కోట్లుగా ఉంది.

మొత్తంగా చూస్తే ఎటర్నల్ షేరు పుంజుకోవడానికి మెరుగైన త్రైమాసిక ఫలితాలు, బ్లింకిట్ విస్తరణ, ఫుడ్ డెలివరీ విభాగంలో స్థిరమైన ఆర్డర్లు, బ్రోకరేజీల సానుకూల అంచనాలు తోడయ్యాయి.

అదే సమయంలో స్విగ్గీ భారీ నష్టాలు నమోదు చేయడం రెండు సంస్థల పనితీరులో వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తోంది.

ADVERTISEMENT