Temple Device: జొమాటో కొత్త బిజినెస్ ఐడియా.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న డాక్టర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
మనిషి శరీరం ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోతోంది. మన గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటోంది? ఎన్ని గంటలు నిద్రపోతున్నాం? శరీరం ఎంత శక్తిని ఖర్చు చేస్తోంది? ఇలా శరీరానికి సంబంధించిన ప్రతి సమాచారానికి మార్కెట్‌లో ఓ ధర ఏర్పడుతోంది. ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను కొత్త వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాపారానికి ఇప్పుడు సైన్స్ ముసుగు కూడా తోడవుతోంది. ఒకప్పుడు బాబాలు తమకు మాత్రమే అద్భుతమైన వైద్య రహస్యాలు తెలుసంటూ ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు శాస్త్రీయ పదజాలం, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో ఇలాంటి వ్యాపారాలు తెరపైకి వస్తున్నాయి.
వివరాలు
రామ్‌దేవ్ బాబా కొరొనిల్ వివాదం గుర్తుందా?
గతంలో యోగా గురువు రామ్‌దేవ్ బాబా కరోనా మందు పేరుతో తీసుకొచ్చిన కొరొనిల్ ఎంతటి వివాదానికి కారణమైందో తెలిసిందే.
ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండానే కరోనాకు విరుగుడు అంటూ ఆయన ఈ మందును తీసుకొచ్చారు. దీనిపై డాక్టర్ల సంఘం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇప్పుడు మరోసారి వైద్యులు ఇదే స్థాయిలో ఓ ఉత్పత్తిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తీసుకొచ్చిన రూ.85 వేల విలువైన టెంపుల్ డివైజ్ చుట్టూ ఈ వివాదం మొదలైంది.
ఇంతకీ ఈ పరికరం ఏమిటి? దీని పనితీరుపై వైద్యులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?
వివరాలు
అసలేంటీ రూ.85 వేల టెంపుల్ డివైజ్?
నుదురు పక్కన అతికించుకునే చిన్న పరికరమే టెంపుల్ డివైజ్. దీని ద్వారా మెదడులో రక్తప్రసరణను గుర్తించవచ్చని దీపిందర్ గోయల్ చెబుతున్నారు. శరీరం ఎంత శ్రమిస్తోంది? ఎంత శక్తిని ఖర్చు చేస్తోంది? వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొంటున్నారు.
అంతేకాకుండా 'ఎంట్రోపీ' అనే కొత్త జీవశాస్త్ర సూచికను సైతం ఈ పరికరం ద్వారా కొలవవచ్చని అంటున్నారు. వినడానికి ఇదొక అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, ఇక్కడ ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఓ ఆవిష్కరణ వినడానికి అద్భుతంగా ఉండటం వేరు.. అది నిజంగా పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించడం వేరు.
వివరాలు
డాక్టర్ల ప్రధాన అభ్యంతరం ఇదే..
ఈ పరికరం పనితీరు, కంపెనీ చెబుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై వైద్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
సిరియాక్ అబ్బీ ఫిలిప్స్, జేసన్ ఫిలిప్, రిషభ్ జైన్ వంటి డాక్టర్లు ఈ విషయంలో తమ సందేహాలను వ్యక్తం చేశారు.
కంపెనీ చెబుతున్న ఆరోగ్య ప్రయోజనాలకు స్వతంత్ర పరిశోధనల మద్దతు ఎంతవరకు ఉందన్నదే వారి ప్రధాన అభ్యంతరం.
గోయల్ బృందం కొన్ని ప్రారంభ పరిశోధనలు నిర్వహించినప్పటికీ, వాటి ఆధారంగా ఈ పరికరం వైద్యపరంగా కచ్చితమైనదని నిర్ధారించలేమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
దీనిపై మరిన్ని పరిశోధనలు జరగడంతో పాటు ఇతర శాస్త్రవేత్తల ధ్రువీకరణ కూడా అవసరమని ప్రశ్నిస్తున్నారు.
వివరాలు
సింధు, శుభ్‌మన్ గిల్ వాడుతున్నారంటే నమ్మేయాలా?
మరోవైపు ప్రముఖ క్రీడాకారులు పీవీ సింధు, శుభ్‌మన్ గిల్ వంటి వారు ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారనే ప్రచారం కూడా దీనిపై ఆసక్తిని పెంచుతోంది.
అయితే ఓ సెలబ్రిటీ లేదా ప్రముఖ క్రీడాకారుడు ఒక పరికరాన్ని ఉపయోగిస్తున్నంత మాత్రాన దాని శాస్త్రీయతకు ధ్రువీకరణ లభించినట్లు కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రముఖుల పేర్లు ఉత్పత్తుల ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ ఆరోగ్యానికి సంబంధించిన వాదనలను నిరూపించడానికి మాత్రం శాస్త్రీయ పరిశోధనలే ప్రామాణికం కావాలి.
వివరాలు
సైన్స్ పేరుతో వ్యాపారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!
ఈ వ్యవహారం గతంలో రామ్‌దేవ్ బాబా కొరొనిల్ చుట్టూ నెలకొన్న వివాదాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
ఈ రెండు ఉత్పత్తుల వాదనలు వేర్వేరు అయినప్పటికీ, శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాల కంటే ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రజలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది.
కొత్త సాంకేతికత అందుబాటులోకి రావడం మంచిదే. వ్యాపారం చేయడమూ సహజమే. అయితే ఆరోగ్యం పేరుతో ప్రజలకు ఎలాంటి సమాచారాన్ని అందిస్తున్నామన్నదే ఇక్కడ కీలకం.
ఓ శాస్త్రీయ పదాన్ని పరిచయం చేసి, దానికి ఓ సంఖ్యను జోడించి, వేల రూపాయలకు పరికరాన్ని విక్రయించడం సులభమే.
వివరాలు
చెప్పడం అంత సులభం కాదు
కానీ ఆ సంఖ్య నిజంగా మన శరీరం గురించి ఏం చెబుతోందో నిరూపించడం అంత సులభం కాదు.
ఎందుకంటే సైన్స్ అంటే కేవలం ప్రచారం కాదు.. ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగే పరిశోధన.
ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపార ప్రయోగంగా మార్చకుండా, తాము చేస్తున్న ప్రతి వాదనకు తగిన శాస్త్రీయ ఆధారాలను చూపించాల్సిన బాధ్యత ఉత్పత్తులను తయారు చేసిన సంస్థలపైనే ఉంటుంది.