Tollywood: చిరు-బాలయ్య-నాగ్ రికార్డుల పోరు.. టాలీవుడ్ చరిత్రలో చెరగని సంవత్సరం అదే
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో కొన్ని రికార్డులు ఎన్నటికీ చెరగవు. కొన్ని ఘనతలు తిరిగి పునరావృతం కావు. అలాంటి అరుదైన విశేషాలకు ప్రతీకగా నిలిచింది 1989 సంవత్సరం. టాలీవుడ్‌కు ఈ ఏడాదిని నిజమైన 'గోల్డెన్ ఇయర్' అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కారణం ఏమిటంటే.. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ముగ్గురు అగ్రహీరోలు నటించిన మూడు సినిమాలు వరుసగా ఒకదాని రికార్డులను మరొకటి అధిగమిస్తూ 'ఇండస్ట్రీ హిట్స్'గా నిలిచాయి. భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి సంఘటన మరెక్కడా చోటుచేసుకుని ఉండకపోవచ్చు. అప్పట్లో ఇది సినీ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
వివరాలు
ఆ ఏడాది నుంచే భారీ సినిమాల సందడి మొదలు..
1989 తర్వాత తెలుగు సినిమా స్థాయి దేశవ్యాప్తంగా మరింతగా పెరిగింది. మార్కెట్ విస్తరించింది. ఆ విజయపథాన్ని కొనసాగిస్తూ తర్వాత మరెన్నో భారీ చిత్రాలు వచ్చాయి. కానీ టాలీవుడ్‌లో అప్పటి వరకు కానీ, ఆ తర్వాత కానీ ఇలాంటి బాక్సాఫీస్ సంచలనం మళ్లీ కనిపించలేదు. అందుకే ఈ ఘనత గురించి నేటి తరానికి తప్పక తెలియాలి. ఈ రికార్డుల పరంపరకు శ్రీకారం చుట్టింది మెగాస్టార్ చిరంజీవి. 1989 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన చిత్రం 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టించింది.
వివరాలు
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి తోడు బాలకృష్ణ మాస్ ఇమేజ్
తెలుగులో అత్త-అల్లుడు నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఇది ప్రత్యేకమైన ప్రమాణంగా నిలిచింది. ఈ సినిమా తొలిసారిగా 14 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై, అప్పటివరకు ఉన్న వసూళ్ల రికార్డులను చెరిపేసి కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. విజయశాంతి ఆకర్షణ, చిరంజీవి నృత్యాలు, చక్రవర్తి సంగీతం ఈ విజయానికి ప్రధాన బలం అయ్యాయి. అయితే చిరంజీవి నెలకొల్పిన ఆ రికార్డు కేవలం నాలుగు నెలలకే సవాల్‌ను ఎదుర్కొంది. అదే ఏడాది ఏప్రిల్ 7న నందమూరి బాలకృష్ణ నటించిన 'ముద్దుల మావయ్య' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి తోడు బాలకృష్ణ మాస్ ఇమేజ్ కలిసి రావడంతో ప్రేక్షకులు ఘనవిజయం అందించారు.
వివరాలు
ఆ ఏడాది రెండో ఇండస్ట్రీ హిట్ ఇదే..
ఈ చిత్రం ఏకంగా 28 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని, 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' వసూళ్ల రికార్డులను అధిగమించింది. దీంతో ఆ సంవత్సరానికి రెండో ఇండస్ట్రీ హిట్‌గా చరిత్రలో స్థానం సంపాదించింది. బాలకృష్ణ రికార్డుల దూకుడుతో 1989 బాక్సాఫీస్ విజేత ఆయనేనని అందరూ భావిస్తున్న సమయంలో, మరో సంచలనం ఆరు నెలల వ్యవధిలో చోటుచేసుకుంది. అక్టోబర్ 5న కింగ్ నాగార్జున నటించిన 'శివ' విడుదలైంది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పరిచయమైన ఈ చిత్రం తెలుగు సినిమా తీరు, మేకింగ్ శైలిని పూర్తిగా మార్చేసింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 22 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించింది.
వివరాలు
సినీ అభిమానులు మరువలేని సంవత్సరం..
తర్వాతి తరానికి ఇది ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అప్పటివరకు 'ముద్దుల మావయ్య' పేరిట ఉన్న అత్యధిక షేర్స్ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర రాసింది. ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వినూత్న టేకింగ్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఫలితంగా 1989లో మూడో ఇండస్ట్రీ హిట్‌గా 'శివ' నిలిచింది. మరో విశేషం ఏమిటంటే.. ఈ మూడు సినిమాలు మూడు భిన్న జానర్లలో రూపొందాయి. ఒకటి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రెండోది భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామా, మూడోది కాలేజ్ రాజకీయాల నేపథ్యంలో వచ్చిన సాంకేతిక అద్భుతం. ముగ్గురు అగ్రతారలు తమదైన శైలిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 1989 సంవత్సరం.. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు, సినీ అభిమానులకు ఎప్పటికీ మరువలేని స్వర్ణయుగంగా నిలిచిపోయింది.