Pokiri Movie: 'ఒక్కసారి కమిట్ అయితే..' 20 ఏళ్లైనా మారని పండుగాడి క్రేజ్!
ఈ వార్తాకథనం ఏంటి
చూస్తుండగానే పండుగాడికి 20 ఏళ్లు నిండిపోయాయి. అప్పట్లో ఎలా ఉన్నాడో, ఇప్పటికీ అలాగే గుర్తుంటాడు. ఎన్ని సార్లు చూసినా ఆ పాత్రపై మోజు తగ్గదు. ఎందుకంటే పండుగాడు అనే క్యారెక్టర్ అలాంటిది. పరుగెత్తుకుంటూ వచ్చి కూరగాయల మధ్య నుంచి ఒక్కసారిగా కనిపించే ఆ ఎంట్రీ చూసిన క్షణం, అభిమానులతో కలిసి వేసిన విజిల్స్ ఇప్పటికీ మరిచిపోలేం. ఆ పరిచయాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. 'షెడ్డు బాగుంది.. కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి' అనే డైలాగ్ వినగానే, ఈ వ్యక్తి ధైర్యం ఎంత అన్న భావన కలిగింది.
వివరాలు
ఆ డైలాగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయ్..
'పేరు చెబితే కానీ తన్నులు తినవా' అన్నప్పుడు, పండుగాడి ఆత్మవిశ్వాసం ఎంత అన్నది అర్థమైంది. 'ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు' అంటూ ఇచ్చిన ఒక్క దెబ్బతో థియేటర్ మొత్తం మార్మోగిపోయింది. ఆ శబ్దం ఇప్పటికీ అభిమానుల చెవుల్లో నిలిచే ఉంటుంది. రౌడీల గూటికే వెళ్లి వాళ్ల మనిషినే కొట్టి, 'నేను ఎవ్వడి దగ్గరా పనిచేయను. పనేంటో చెప్పు.. నీకెంత.. నాకెంతో చెప్పు' అని స్టైల్‌గా చెప్పే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముక్కు ఎగపీల్చే ఆ స్టైల్‌ను చూసి, జలుబు లేకపోయినా అనుకరించిన అభిమానులు ఎందరో. అదే నిజమైన మాస్ హిస్టీరియా. డాక్టర్ చికిత్స చేయడానికి వెనుకాడితే, అతడినే బెదిరించి చికిత్స చేయించడం పండుగాడి తెగువను చూపించింది.
వివరాలు
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్
అక్కడి నుంచి కథ మలుపు తిరిగి, 'పది మంది ఉన్నారు.. అందరినీ ఏసేస్తే ఇంటికి వెళ్లిపోవచ్చు.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా' అంటూ గన్ తీసుకుని బండ గణేశ్‌పై కాల్చే సన్నివేశం పండుగాడి సాహసాన్ని మరింత పెంచింది. ఇవన్నీ ఒకెత్తయితే, బాస్కెట్‌బాల్ కోర్టులో ఎస్సై పశుపతికి ఇచ్చిన వార్నింగ్ మరో స్థాయిలో నిలిచింది. 'నీ స్టేషన్‌లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నావా? బిల్డర్ హ్యాండోవర్ చేశాడా? పద్మావతి హ్యాపీయేనా? టైల్స్ ఏత్తన్నారంటగా.. శ్రుతి నాదే.. రివాల్వర్ నాదే' అంటూ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ సీన్‌కు మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కల్ట్‌గా మారింది.
వివరాలు
కథలో అదే పెద్ద ట్విస్ట్..
అందరూ అలీ భాయ్‌ను చూసి భయపడుతుంటే, పండుగాడు మాత్రం అతడి ఎదుటే స్టైలిష్‌గా కూర్చుంటాడు. 'ఒకడు తాగమంటే తాగను.. తాగాలనిపిస్తే తాగుతా' అనే డైలాగ్ అసలైన యాటిట్యూడ్‌కు నిర్వచనంలా నిలిచింది. శ్రుతి తన బాధను చెప్పుకుంటూ 'నా కోసం ఏమీ చేయవా' అని అడిగితే, 'నువ్వు ఏం చేశావ్.. క్యారియర్ క్యారియర్లు పట్టుకుని తిరుగుతుంటావు తప్ప.. ఏనాడైనా పెట్టావా ఏమైనా' అంటూ సరదాగా చెప్పే సన్నివేశం వినోదాన్ని పంచింది. తండ్రి సూర్యనారాయణ, స్నేహితుడు అజయ్‌ను అలీ భాయ్ చంపిన తర్వాత అక్కడికి పండుగాడు పరుగెత్తుకుంటూ వచ్చే సీన్ కథలో పెద్ద ట్విస్ట్‌గా నిలిచింది.
వివరాలు
అదరగొట్టిన క్లైమాక్స్ ఫైట్
'కృష్ణ మనోహర్ ఐపీఎస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్.. 57వ బ్యాచ్.. బ్యాచ్ నెం.32567.. ట్రెయిన్డ్ ఎట్ దేహ్రాదూన్.. టాపర్ ఇన్ ది బ్యాచ్' అంటూ చెప్పే డైలాగ్ వినగానే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వచ్చాయి. ఆ క్షణం సినిమా మరో స్థాయికి వెళ్లిపోయింది. క్లైమాక్స్ ఫైట్‌లో అలీ భాయ్‌ను కొట్టే సమయంలో థియేటర్‌లో ఒక్కసారిగా శబ్దం తగ్గిపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. నిజంగానే సౌండ్ ఆపేశారా అనుకునేంతగా ఆ సన్నివేశం సాగింది. కొన్ని క్షణాల తర్వాత అది కూడా ఓ ట్విస్ట్‌గా మారింది. 'పండుగాడి దెబ్బకు మైండ్ బ్లాక్ అవడమంటే ఇదే' అని అనిపించింది.
వివరాలు
పోకిరి లాంటి సినిమా మళ్లీ రాదు..
చివరగా ఎస్సై పశుపతిని కాల్చేసి, 'ఒక్కసారి కమిట్ అయితే, నా మాట నేనే వినను' అంటూ చెప్పిన పండుగాడి డైలాగ్‌తో సినిమా ముగిసినా, ఆ పాత్ర మాత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఇంటికి వెళ్లినా, పడుకున్నా, స్నేహితులతో మాట్లాడినా.. ఆ ఏడాది అంతా పండుగాడి గురించే మాట్లాడుకున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది హీరోలు, దర్శకులు ఎన్నో గొప్ప పాత్రలను పరిచయం చేసి ఉండొచ్చు. భవిష్యత్‌లో కూడా మరెన్నో పాత్రలు రావొచ్చు. కానీ పూరి జగన్నాథ్ సృష్టించిన పండుగాడు మాత్రం ఒక్కరే. మళ్లీ అదే దర్శకుడు ప్రయత్నించినా, ఆ మ్యాజిక్‌ను తిరిగి సృష్టించడం కష్టమే. అందుకే ఆ తరానికి పండుగాడు అంత ఫేమస్ అయ్యాడు.