Loading...
Swathi Muthyam: 40 ఏళ్ల 'స్వాతిముత్యం'.. ఆస్కార్ ఎంట్రీ సాధించిన తెలుగు క్లాసిక్!
40 ఏళ్ల 'స్వాతిముత్యం'.. ఆస్కార్ ఎంట్రీ సాధించిన తెలుగు క్లాసిక్!

Swathi Muthyam: 40 ఏళ్ల 'స్వాతిముత్యం'.. ఆస్కార్ ఎంట్రీ సాధించిన తెలుగు క్లాసిక్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

వితంతువైన హీరోయిన్... ఆమెకు అప్పటికే ఒక చిన్నబిడ్డ..అమాయక స్వభావం ఉన్న హీరో ఆమెను వివాహం చేసుకోవడం లాంటి సున్నితమైన కథతో సినిమా తీర్చిదిద్దడం అంటే దర్శకుడు, నిర్మాతలకు అపారమైన ధైర్యం అవసరం. అంతేకాదు, గ్లామర్‌కు దూరంగా ఉండే అలాంటి పాత్రలను అంగీకరించడానికి నటీనటులకు కూడా ముందుకురారు. ఆ లక్షణాలన్నింటినీ కలగలిపిన చిత్రం 'స్వాతిముత్యం'. 1986 మార్చి 13న విడుదలైన ఈ క్లాసిక్ మూవీ నేటికి 40 ఏళ్లు పూర్తిచేసుకుంది. విడుదల సమయంలో మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

'స్వాతిముత్యం'కు అవార్డుల పంట

సినిమాలో హీరో పాత్రకు అనుగుణంగా మొదట 'శివయ్య' అనే టైటిల్ పెట్టాలని ఆలోచించారు.

కానీ చివరకు 'స్వాతిముత్యం' అనే పేరునే ఖరారు చేశారు.

ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది.

అలాగే ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో మూడు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.

అంతేకాదు, ఆస్కార్ అవార్డులకు అధికారిక ఎంట్రీగా ఎంపికైన తొలి దక్షిణాది చిత్రంగా కూడా 'స్వాతిముత్యం' నిలిచింది.

ఆస్కార్‌కు పంపకముందే ఈ సినిమా మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

వివరాలు

క్లైమాక్స్ మారిందిలా..

సినిమా క్లైమాక్స్ విషయంలో మొదట హీరో శివయ్య సాధారణ మనిషిగా మారేలా కథను ముగించాలని దర్శకుడు భావించారు.

అయితే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆ ఆలోచనకు సమ్మతించలేదు.

అలాగే హీరోయిన్ పాత్రను ముగించకుండా కథను సుఖాంతంగా ముగించాలని తొలుత నిర్ణయించారు.

కానీ తరువాత జరిగిన చర్చల అనంతరం హృదయాన్ని తాకే విధంగా క్లైమాక్స్ మార్చారు.

ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించగా, చిన్న మనవడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించాడు.

రాధిక కుమారుడి పాత్రలో నటుడు కాంతారావు మనవడు కార్తీక్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

విడుదల తర్వాత ఈ సినిమా 25 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది.

ADVERTISEMENT

వివరాలు

బాలీవుడ్ లోకి రీమేక్

బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదికిపైగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించింది.

1986 జూన్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవ వేడుకకు అప్పటి సీఎం ఎన్.టి.రామారావు హాజరయ్యారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి సినిమా వేడుక ఇదే.

కార్యక్రమంలో చిరంజీవి, బాలీవుడ్ ప్రముఖుడు రాజ్‌కపూర్ కూడా పాల్గొన్నారు.

1994లో విడుదలైన హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'లోని హీరో పాత్ర 'స్వాతిముత్యం'లోని శివయ్య పాత్రకు పోలికగా ఉందని కమల్ హాసన్ ఒక సందర్భంలో తెలిపారు.

అలా మన సినిమాలు హాలీవుడ్‌కూ స్ఫూర్తినిచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సినిమా తరువాత దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే బాలీవుడ్‌లో 'ఈశ్వర్' పేరుతో రీమేక్ చేశారు.

అందులో అనిల్ కపూర్ హీరోగా నటించగా, విజయశాంతి హీరోయిన్‌గా నటించింది.

ADVERTISEMENT

వివరాలు

కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం

కన్నడలో కూడా 'స్వాతిముత్యం' కథను రాజేంద్ర బాబు దర్శకత్వంలో సుదీప్ హీరోగా మళ్లీ తెరకెక్కించారు.

సాధారణంగా అవార్డులు గెలిచే సినిమాలు వాణిజ్యపరంగా పెద్దగా రాణించవు అనే అభిప్రాయం ఉంటుంది.

కానీ సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన 'స్వాతిముత్యం' మాత్రం కమర్షియల్‌గా కూడా విజయాన్ని అందుకుంది.

ఇది కె. విశ్వనాథ్ రచన, దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.

విశ్వనాథ్ - ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం మరో ఆణిముత్యంగా నిలిచింది.

వివరాలు

అసలైన కల్ట్ క్లాసిక్..'స్వాతిముత్యం'

ఇళయరాజా సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

'సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ', 'మనసు పలికే మౌనరాగం', 'లాలీ లాలీ' వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.

శివయ్య పాత్రలో కమల్ హాసన్, లలిత పాత్రలో రాధిక తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

ఇండస్ట్రీలో ప్రస్తుతం 'కల్ట్' అనే పదం తరచుగా వినిపిస్తోంది.

నిజమైన అర్థంలో చెప్పాలంటే 'స్వాతిముత్యం' ఒక అసలైన కల్ట్ క్లాసిక్.

ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్, అలాగే యూట్యూబ్‌లో కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.

ADVERTISEMENT