
Chiranjeevi: 47 ఏళ్ల సినీ ప్రయాణం.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు. 1978లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 47 ఏళ్లుగా అభిమానుల హృదయాల్లో అజరామరుడిగా నిలిచిపోయారు. తన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' విడుదలై నేటికి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవి భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. '22 సెప్టెంబర్ 1978... కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను 'చిరంజీవి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాను. అప్పటి నుంచి నన్ను అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా చూసిన మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞుడిని. మీ అపారమైన ప్రేమే నన్ను 155 సినిమాల పాటు నడిపించింది.
Details
నెటిజన్ల ప్రశంసల వెల్లువ
ఈ అనురాగం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ విశిష్ట మైలురాయిని పురస్కరించుకుని సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చిరంజీవి ప్రస్థానాన్ని ఘనంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి, ఆ తర్వాత "మెగాస్టార్"గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్నారు. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు సాటిగా వరుస సినిమాలతో పోటీ ఇస్తూ ప్రేరణగా నిలుస్తున్నారు. తన 47 ఏళ్ల సినీ ప్రయాణంలో అనేక అవార్డులు, గౌరవాలు, అఖండమైన అభిమానాన్ని పొందిన చిరంజీవి, ఆ ప్రతిష్టలన్నీ తనకే కాకుండా ప్రేక్షకుల ప్రేమ ఫలితమేనని వినమ్రంగా పేర్కొనడం అందరినీ హత్తుకుంది.
Details
సోషల్ మీడియాలో #47YearsOfChiranjeeviEra హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్
సోషల్ మీడియాలో ప్రస్తుతం #47YearsOfChiranjeeviEra హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అభిమానులు ఆయన కెరీర్‌లోని మధుర సన్నివేశాలు, పాటలు, డైలాగ్‌లను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి సినీ ప్రయాణం ఇప్పటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతుండటం సినీప్రేమికులకు గర్వకారణం. ప్రస్తుతం ఆయన 'మన శంకర్ వరప్రసాద్ గారు' చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే మరోవైపు విశ్వంభరతో కూడా ప్రేక్షకులను పలకరించనున్నారు.