బాహుబలి 2: భారతీయ సినిమా రంగాన్ని తెలుగు సినిమా వైపు తిప్పిన చిత్రానికి ఆరేళ్ళు
బాహుబలి సినిమా రాకపోతే పాన్ ఇండియా అన్న పదమే వచ్చి ఉండేది కాదేమో! భారతీయ సినిమా రంగంలో బాహుబలి ఒక పెద్ద సంచలనం. రాజమౌళి సృష్టించిన అద్భుతానికి ఔరా అనని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. బాహుబలి 2 సినిమా రిలీజై నేటికి ఆరేళ్ళు పూర్తవుతుంది. తెలుగు సినిమా చరిత్రను మార్చిన సినిమా విడుదలయ్యి అర్థపుష్కరం గడిచింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2 గురించి మాట్లాడుకుందాం. లక్షల మందిని ఎదురుచూసేలా చేసిన ఒక్క మాట: బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే మాట సినీ అభిమానుల్లో మాత్రమే కాదు సినిమాలు పెద్దగా చూడని వారిలోనూ ఆసక్తిని కలిగించింది. ఎప్పుడూ సినిమాలు చూడని వారు సైతం బాహుబలి చూడాలనుకున్నారు.
హిందీలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2
బాహుబలి రిలీజైన రెండేళ్ల తర్వాత బాహుబలి 2 చిత్రం రిలీజైంది. విడుదలైన అన్ని చోట్లా బాహుబలి 2 సినిమాకు మంచి ఆదరణ లభించింది. మొత్తం ఫుల్ రన్ లో బాహుబలి 2 సినిమాకు 1800కోట్ల వసూళ్ళు వచ్చాయి. తెలుగులో రూపొందిన ఈ సినిమా, హిందీలో అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇటు కన్నడలోనూ, అటు తమిళంలోనూ అదే పరిస్థితి. ఒక డబ్బింగ్ చిత్రానికి ఆ స్థాయి కలెక్షన్లు వస్తాయని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. అదే మరి రాజమౌళి మ్యాజిక్ అంటే. బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, నాజర్, రమ్యకృష్ణ, సత్యరాజ్, సుబ్బరాజు, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.