7/G బృందావన కాలనీ రీ రిలీజ్: మొదటి రోజే రూ.కోటి వసూలు చేసిన కల్ట్ క్లాసిక్
కొన్ని సినిమాలకు కాలంతో పని ఉండదు. ఎప్పుడు చూసినా అవి బోర్ కొట్టవు. అరే, ఇది పాత సినిమా కదా అని అనిపించదు. ఎన్నేళ్లయినా, ఎన్నిసార్లు చూసినా మొదటి సారి చూసిన ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే చూస్తూ ఉన్నా కొద్ది అందులో ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తుంటుంది. అలాంటి సినిమాల్లో 7/G బృందావన కాలనీ కూడా ఒకటి. నిర్మాత A.M రత్నం కుమారుడు రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2004సంవత్సరంలో విడుదలైంది. అప్పట్లో మంచి విజయం సాధించిన ఈ సినిమా, తాజాగా సెప్టెంబర్ 22వ తేదీన మరోసారి విడుదలైంది.
కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన 7/G బృందావన కాలనీ
7/G బృందావన కాలనీ సినిమాకు తెలుగులో తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఏకంగా కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన 7/G బృందావన కాలనీ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు జనం ఎగబడ్డారు. స్క్రీన్ మీద సినిమా రన్ అవుతుంటే, డైలాగులు చెప్పేస్తూ.. పాటలకు డ్యాన్సులు ఆడేస్తూ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వాటి తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మొత్తానికి కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన 7/G బృందావన కాలనీ రీ రిలీజ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.