Actor Shivaji: ఇండస్ట్రీలో 95% మంది జీవితాలు సాదాసీదానే.. ఐబొమ్మ రవి కేసుపై శివాజీ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా పరిశ్రమలో నిజమైన స్థితిగతులపై తన అభిప్రాయాలను నటుడు శివాజీ (Shivaji) వెల్లడించారు. ఇండస్ట్రీలో 95శాతం మంది సాధారణ, సాదాసీదా జీవితం గడుపుతున్నారని, కేవలం 5% మంది మాత్రమే లగ్జరీగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కొద్దిమంది ఆధారంగా మొత్తం పరిశ్రమను తప్పుబట్టడం సరైన తీరు కాదని అన్నారు. పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి విషయమై మాట్లాడుతూ, ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చట్టం తన విధి విధానాల ప్రకారం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మన దేశ చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే తప్పకుండా శిక్ష అనుభవించాలని శివాజీ చెప్పారు.
Details
సినిమా టికెట్ రూ. 100 పెరిగినా ఇండస్ట్రీని విలన్ గా చూస్తారు
అలాగే టికెట్ ధరలపై జరుగుతున్న విమర్శలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి, పెద్ద పండగల సమయంలో బస్సు టికెట్ ధరలు మూడింతలు పెరుగుతాయి. ఆ విషయం ఎవరూ ప్రస్తావించరు. కానీ సినిమా టికెట్ రూ. 100 పెరిగినా ఇండస్ట్రీని వెంటనే విలన్‌లా చూపిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. కంటెంట్ బలంగా ఉంటే పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని శివాజీ అభిప్రాయపడ్డారు. థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్ వంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావని, అలాంటి వాటిని తినకుండా ఉండటం మంచిదని కూడా సూచించారు.