LOADING...
HBD Mani Ratnam: ఒక ప్రేమకథకే కాదు.. ఒక యుగానికి రూపకర్త 'మణిరత్నం'
నాటికి ఓ దర్శకుడు.. నేటికి ఓ లెజెండ్.. 'మణిరత్నం' కథలో స్పెషాలిటీ ఇదే!

HBD Mani Ratnam: ఒక ప్రేమకథకే కాదు.. ఒక యుగానికి రూపకర్త 'మణిరత్నం'

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం, తన ప్రత్యేక శైలితో భారత సినిమా రంగాన్ని మలిచిన అద్భుత శిల్పి. ఆయన రూపొందించిన చిత్రాలు అంతర్జాతీయంగా ప్రదర్శించబడడమే కాదు, దేశ సమస్యలను ప్రేమకథలతో ముడిపెట్టి ఎంతో డెప్త్ ఉన్న కథనాలను అందించడంలో మణిరత్నం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. సా ధారణ ప్రేమజంట జీవితాలకే కేంద్రంగా, సమాజం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్ని చర్చించడంలో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రేమ కథను నెరపుతూ, దేశ చింతనను పటిష్టంగా వినిపిస్తూ, ఆడియన్స్‌ను భావోద్వేగాలకు లోనుచేసే విధంగా సినిమాలు తీర్చిదిద్దుతారు. మణిరత్నం సినిమాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం విశేషం. ఇవాళ మణి రత్నం పుట్టిన రోజు. ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

Details

టాలీవుడ్ లో గీతాంజలితో గుర్తింపు

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన మణిరత్నం, మొదటగా కన్నడలో 'పల్లవి అనుపల్లవి' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం 'మౌనరాగం' వంటి హిట్ చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. చిన్న కథే అయినా, టేకింగ్‌లో ఉన్న విలక్షణత, డైరెక్షన్‌లో ఉన్న లోతు మణిరత్నం సినిమాల సౌందర్యాన్ని తెలియజేస్తాయి. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది, అంతేకాక ఆస్కార్‌కు నామినేట్‌ కూడా అయింది. తెలుగులో ఆయన తొలి సినిమా గీతాంజలి, హీరో నాగార్జున కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచింది. కేవలం 60 రోజుల్లో పూర్తి చేసిన ఈ మ్యూజికల్ హిట్ యూత్‌లో భారీ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

Details

ఐశ్వర్యరాయ్ ని వెండితెరకు పరిచయం చేసిన మణిరత్నం

రోజా, బొంబాయి, దిల్ సే వంటి టెర్రరిజం ట్రయాలజీ చిత్రాలు దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా పలు ప్రశంసలు అందుకున్నాయి. దళపతి వంటి మాస్ అండ్ క్లాస్ హిట్‌తో రజినీకాంత్, మమ్ముట్టిలను ప్రధాన పాత్రల్లో చూపిస్తూ మణిరత్నం తన ప్రతిభను మరోసారి నిరూపించారు. ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ను వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. తమిళ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన 'ఇద్దరు' సినిమాలో ఐశ్వర్య, మోహన్ లాల్, ప్రకాశ్ రాజ్, టబూ, మధుబాల వంటి స్టార్ కాస్టింగ్‌తో మరో విలక్షణ చిత్రాన్ని అందించారు.

Details

మణిరత్నం అంటేనే సినీ ఫ్యాక్టరీ

మణిరత్నం అంటే సినీ ఫ్యాక్టరీ. ఎందరో నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఆయన దగ్గర నుంచి బలపడారు. భారతదేశానికి ఆస్కార్ అందించిన ఏఆర్ రెహ్మాన్‌ను పరిచయం చేసిన ఘనత కూడా మణిరత్నం‌కే దక్కింది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన 'థగ్ లైఫ్' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈరోజు మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా, ఆయన సినిమా ప్రయాణాన్ని స్మరించుకుంటూ, ఆయన చేసిన సినిమా సేవలను భారత సినీ ప్రేక్షకులు గర్వంగా గుర్తుచేసుకుంటున్నారు.