Vishwambhara : చిరంజీవి 'విశ్వంభర'కి కొత్త ట్విస్ట్ .. కీరవాణి ఔట్ ..గౌరహరి చేతుల్లోకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఈ వార్తాకథనం ఏంటి
'విశ్వంభర' సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన మార్పు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా, విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఎన్నో సార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను మరో సంగీత దర్శకుడు హరి గౌరకి అప్పగించినట్లు తెలుస్తోంది.
వివరాలు
రీ రికార్డింగ్ పనులు ప్రారంభం..
పాటల కోసం మాత్రం కీరవాణి స్వరపరిచిన సంగీతాన్ని కొనసాగిస్తుండగా, నేపథ్య సంగీతంలో కొత్తదనం తీసుకురావాలనే ఉద్దేశంతో హరి గౌరను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన 'విశ్వంభర' కోసం ఆర్.ఆర్ (రీ-రికార్డింగ్) పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. హరి గౌర గతంలో 'హనుమాన్' చిత్రానికి ఇచ్చిన శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమా విజయంలో ఆయన సంగీతం కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా 'మిరాయ్' చిత్రానికి కూడా మంచి సంగీతాన్ని అందించారు.
వివరాలు
హరి గౌరకు ఆ బాధ్యతలు అప్పగింత..
'విశ్వంభర' లాంటి సోషియో-ఫాంటసీ జానర్ సినిమాలో ఆయన తన ప్రత్యేక శైలిలో బలమైన నేపథ్య సంగీతాన్ని అందిస్తారని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడంలో కీరవాణికి మంచి అనుభవం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్ కోసం గౌరహరిని తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా, రాజమౌళి రూపొందిస్తున్న మరో ప్రాజెక్ట్‌కు సంబంధించిన సంగీత పనుల్లో కీరవాణి బిజీగా ఉండటంతో, 'విశ్వంభర' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను హరి గౌరకు అప్పగించినట్టు కూడా వినిపిస్తోంది.