Loading...
Vijay Sethupathi: విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులకు ప్రజెంటర్‌గా!
విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులకు ప్రజెంటర్‌గా!

Vijay Sethupathi: విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డులకు ప్రజెంటర్‌గా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా ఖ్యాతిని చాటుతూ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకోనున్నారు. న్యూయార్క్‌లో నవంబర్ 23న జరగనున్న 54వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేడుకలో ఆయన ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై అవార్డును ప్రదానం చేయనున్న తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి చరిత్ర సృష్టించబోతున్నారు. భారతీయ నటులు అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్న సమయంలో ఆయనకు ఈ అవకాశం దక్కడం విశేషం. గతంలో 2016లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా వ్యవహరించారు.

వివరాలు

తొలి భారతీయ నటుడిగా గుర్తింపు

అయితే ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై ఈ గౌరవాన్ని అందుకోనున్న తొలి భారతీయ నటుడు మాత్రం విజయ్ సేతుపతే.

అంతర్జాతీయ వేదికలపై భారతీయ ప్రతిభకు గుర్తింపు తీసుకురావడంలో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బోర్డు సభ్యురాలు, నిర్మాత కవితా గుప్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.

2024లో ప్రముఖ కమెడియన్ వీర్ దాస్‌ను ఈ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా పరిచయం చేసింది కూడా ఆమె కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతి కెరీర్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ చిత్రం 'మహారాజ' (2024) హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. ఈ సినిమా చైనాలోనూ భారీ విజయాన్ని అందుకుంది.

వివరాలు

ఓటీటీలో మంచి స్పందన

అక్కడ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.91.65 కోట్ల వసూళ్లు సాధించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.

చైనాలో లభించిన విజయంతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు.

ఈ విషయాన్ని ఆయన 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఓ ఏ-లిస్ట్ హాలీవుడ్ స్టార్‌తో రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సుధన్ సుందరం తెలిపారు.

వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని వివరించారు. దీంతో 'మహారాజ' హాలీవుడ్ రీమేక్‌పై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT

వివరాలు

మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులో విజయ్ సేతుపతి

మరోవైపు ఈ రీమేక్‌లో హాలీవుడ్ స్టార్ నటుడు మాథ్యూ మెకనౌఘే నటించవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ఊహాగానాలపై నిర్మాత సుధన్ సుందరం స్పందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటుల వివరాలను సదరు హాలీవుడ్ ఏజెన్సీనే అధికారికంగా ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.

దీంతో మాథ్యూ మెకనౌఘే పేరుపై వస్తున్న వార్తలకు ఇంకా అధికారిక నిర్ధారణ లభించలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి మరో ఆసక్తికరమైన ప్రాజెక్టులో నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న'ఇంజి వెల్లం'అనే రొమాంటిక్ డ్రామాలో సాయి పల్లవితో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల వేదికపై ప్రజెంటర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకోవడంతో పాటు, మరోవైపు తన సినిమాతో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు విజయ్ సేతుపతి సిద్ధమవుతున్నారు.

ADVERTISEMENT