Ram Gopal Varma: సిక్స్ ప్యాక్ అనేది శక్తికి చిహ్నం కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో కండలు తిరిగిన దేహం, సిక్స్ ప్యాక్‌తో కనిపించే హీరోలకు.. నిజ జీవితంలో అధికారాన్ని చెలాయించే శక్తిమంతులకు ఏమాత్రం సంబంధం ఉండదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి.. అలాంటి శరీర సౌష్టవం లేని వ్యక్తి కింద పనిచేయడమే నిజ జీవితంలో కనిపించే వాస్తవమని పేర్కొన్నారు. ఈ మేరకు తన 'ఎక్స్' ఖాతాలో ఆసక్తికరమైన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
వివరాలు
సిక్స్ ప్యాక్ ఓ అలంకారం మాత్రమే..
'ది ఐరనీ ఆఫ్ టఫ్ హీరోస్ హైడింగ్ బిహైండ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్' అనే లైన్‌తో వర్మ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
బాహుబలికి ముందు వచ్చిన సినిమాలు, ఆ తర్వాత తెరకెక్కిన చిత్రాలు ఒక వాస్తవాన్ని విస్మరించాయి.
నిజ జీవితంలో శక్తిమంతులైన వ్యక్తులు సినిమాల్లో కనిపించే కండలు తిరిగిన హీరోల్లా ఉండరు. సిక్స్ ప్యాక్‌తో ఉండే వ్యక్తులు తరచుగా పొట్టిగా, సన్నగా, లావుగా లేదా పొట్ట ఉన్న వ్యక్తుల కింద పనిచేస్తుంటారని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సినిమాల్లో సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తినే అత్యంత బలవంతుడిగా చూపిస్తారని వర్మ అన్నారు. కానీ నిజ జీవితంలో అలాంటి వ్యక్తి.. జిమ్‌కు వెళ్లని, పొట్టిగా ఉండే బట్టతల వ్యక్తి వెనుక నిలబడతాడని వివరించారు.
వివరాలు
నెపోలియన్, స్టాలిన్ ఉదాహరణలు..
సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి జీవించడానికి అవసరమైన జీతాన్ని ఇచ్చేది కూడా ఆ సాధారణ వ్యక్తేనని వ్యాఖ్యానించారు.
తన వాదనకు మద్దతుగా చారిత్రక వ్యక్తుల ఉదాహరణలను వర్మ ప్రస్తావించారు. ''చక్రవర్తి నెపోలియన్ 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండేవాడు.
చూడటానికి ఓ గుమాస్తాలా కనిపించినా.. యూరప్‌లోని బలవంతులంతా ఆయన కింద పనిచేసేవారు.
అలాగే 5 అడుగుల 4 అంగుళాల ఎత్తున్న స్టాలిన్ ఓ బంగాళాదుంపలా కనిపించేవాడు. కానీ ఆయన ఆదేశాలను అమలు చేసే సైనికాధికారులు మాత్రం ఫిట్‌గా ఉండేవారు.
వారిని క్షణాల్లో కాల్చి చంపగల అధికారం స్టాలిన్‌కు ఉండేదని పేర్కొన్నారు.
వివరాలు
మాఫియా డాన్ల నుంచి రాజకీయ నాయకుల వరకు..
అల్ కపోన్, పాబ్లో ఎస్కోబార్, దావూద్ ఇబ్రహీం వంటి మాఫియా డాన్లలో ఎవరూ కండలు తిరిగిన శరీర సౌష్టవంతో కనిపించలేదని వర్మ గుర్తుచేశారు.
వారి కోసం హత్యలు చేసే కింది స్థాయి వ్యక్తులే శారీరకంగా బలంగా ఉండేవారని, వారికి తక్కువ జీతాలు ఇచ్చి అవసరం తీరిన తర్వాత సులభంగా వదిలించుకునేవారని వ్యాఖ్యానించారు.
భారత రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఫోన్ కంటే బరువైన వస్తువును కూడా ఎత్తని నాయకుల చుట్టూ ఆరడుగుల ఎత్తున్న బాడీగార్డులు బానిసల్లా కాపలా కాస్తుంటారని పేర్కొన్నారు.
సైన్యంలోనూ పొట్ట ఉన్న జనరల్స్.. ఫిట్‌గా ఉండే సైనికులను యుద్ధంలోకి పంపిస్తారని, వారు మాత్రం బుల్లెట్ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వివరాలు
శక్తికి చిహ్నం కాదు.. అలంకారం!
చివరగా.. సినిమాల్లో సిక్స్ ప్యాక్ అనేది శక్తికి చిహ్నం కాదని, కేవలం ఓ అలంకారం మాత్రమేనని వర్మ వ్యాఖ్యానించారు.
నిజ జీవితంలో సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి.. దాని గురించి ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి కిందే పనిచేస్తాడంటూ తన పోస్ట్‌ను ముగించారు.